డ్రైవింగ్‌ టెస్ట్‌ లేకుండానే లైసెన్స్‌

డ్రైవింగ్‌ టెస్ట్‌ లేకుండానే లైసెన్స్‌

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ముందుగా లెర్నింగ్ తీసుకోవాలి.  ఆ తర్వాత ఆరునెలల్లో ఫర్మినెంట్ కోసం అప్లై చేసుకోవాలి. ఆర్టీఏ అధికారుల ఏ వెహికిల్ కోసం లైసెన్స్ తీసుకుంటున్నామో…ఆ వెహికిల్ ను రూల్స్ ప్రకారం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సరిగా వాహనాన్ని నడిపితేనే వారు లైసెన్స్ ఇస్తారు. లేదంటే మరోసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఇబ్బందులు పడాల్సిందే. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్‌లు పొంద‌వ‌చ్చని తెలిపింది. డ్రైవింగ్‌ టెస్ట్‌ లేకుండానే లైసెన్స్‌లు జారీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్సుపోర్ట్ అండ్ హైవేస్ డ్రైవర్ ట్రెయినింగ్ సెంటర్ల అక్రిడేషన్ కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి క్వాలిటీ ట్రైనింగ్ అందించేందుకు ట్రైనింగ్‌ సెంటర్లు అనుసరించాల్సిన విధివిధానాలను అందులో నిర్దేశించింది.

ఈ సెంటర్లలో శిక్షణ పూర్తిచేసుకున్న వారు డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రత్యేకించి మళ్లీ డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదని ముసాయిదాలో తెలిపారు. నాణ్యమైన డ్రైవర్లను తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని…అంతేకాదు దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని కేంద్రం తెలిపింది. గత నెల 29న జారీచేసిన ఈ ముసాయిదాను, ప్రజాభిప్రాయం కోసం రవాణా శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించాలని కేంద్ర రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.