జనగామ, వెలుగు: వారసుడిగా చూపి, కాపురాన్ని నిలుపు కోవడానికే మహిళ బాలుడిని కిడ్నాప్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మల్లంపల్లికి చెందిన తల్లపల్లి రాజుతో జ్యోతికి పెండ్లి అయింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత 2021లో రాజు మృతి చెందాడు. ఆ తర్వాత ఏడాదికి శాగా సురేశ్‌తో జ్యోతికి రెండో పెండ్లి జరిగింది. అప్పటికే మొదటి భార్య తో సురేశ్‌కు ముగ్గురు ఆడపిల్లలు . కాగా గతేడాది ఆగస్టులో జ్యోతి ప్రెగ్నెంట్ కాగా.. ఓ స్కానింగ్ సెంటర్లో లింగ నిర్దారణ చేయించుకోవడంతో ఆడపిల్లే అని తేలింది. ఇప్పటికే తనకు ఇద్దరు, రెండో భర్తకు ముగ్గురు ఆడపిల్లలు కావడంతో గర్భస్రావం చేయించుకుంది.
ట్రీట్మెంట్ పేరుతో ఎంసీహెచ్‌కు వెళ్లి, పిల్లల వార్డులోకి ప్రవేశించింది. అదే సమయంలో ఆరు రోజుల వయసున్న బాబు ఏడుస్తుండగా, డైపర్ మార్చాలని సెక్యూరిటీ గార్డును నమ్మించి లోపలికి వెళ్లి బాబును దగ్గరకు తీసుకుంది. అనంతరం “పాలు తాపిస్తాను” అని చెప్పి బయటకు వచ్చి ఆటో ఎక్కి జనగామ వైపు బయలుదేరింది. అదే సమయంలో బెడ్ వద్దకు వెళ్లిన తండ్రి కరుణాకర్‌కు బాబు కన్పించక పోవడంతో సెక్యూరిటీ గార్డ్‌ను ప్రశ్నించడంతో మీ వాళ్లకే ఇచ్చానంటూ చెప్పాడు. బాబును ఆటోలో తీసుకెళ్లినట్లు తెలియడంతో కరుణాకర్ వెంబడించి పట్టుకున్నాడు. అయినప్పటికీ తన బాబే అంటూ బుకాయించడంతో ఎంసీహెచ్‌కు తీసుకొచ్చారు. అక్కడ జ్యోతిపై బాబు తల్లిదండ్రులు, ఇతరులు దాడి చేశారు. అనంతరం పోలీసులు అమెను తీసుకొని విచారించగా వారసుడిగా చూపించి కాపురం నిలబెట్టుకోవాలని భావించి కిడ్నాప్ చేసినట్టుగా వెల్లడించింది. జ్యోతిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
