అంబర్ పేట, వెలుగు: అపార్ట్మెంట్లో మహిళపై దాడి చేసి బంగారం దోచుకున్న ముగ్గురిని సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్, లాలాగూడ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను డీసీపీ రక్షిత మూర్తి మంగళవారం వెల్లడించారు. ఈస్ట్ మారేడ్‌పల్లిలోని అరిహంత్ సదన్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న శరత్ నరేశ్ఫ్లాట్నంబర్ 301లోకి ఈ నెల 21న నిందితులు అక్రమంగా చొరబడి ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి 28.8 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు.
ఈ కేసులో ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన గుర్రప్పగారి మహేశ్, పవన్ కుమార్, గీజు సురేంద్రను నిందితులుగా గుర్తించారు. మహేశ్ గతంలో ఇదే అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేయడంతో అక్కడి పరిస్థితులపై ఉన్న అవగాహనతో తన స్నేహితులతో కలిసి ఈ దొంగతనానికి ప్లాన్ చేసినట్లు గుర్తించారు. టెక్నికల్ ఆధారాలతో మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో వీరిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుల నుంచి 28.8 గ్రాముల బంగారంతోపాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
