వరంగల్ జిల్లాలో కలెక్ట రేట్ ఎదుట మహిళ ఆత్మహత్యా యత్నం

వరంగల్ జిల్లాలో కలెక్ట రేట్ ఎదుట మహిళ ఆత్మహత్యా యత్నం
  •     తన భూమి కబ్జా చేశారని ఆరోపణ

ములుగు, వెలుగు: తన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ములుగుకు చెందిన ఓ మహిళ కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధిత కుటుంబం తెలిపిన ప్రకారం.. ములుగు యాదవ్‌‌నగర్‌‌కు చెందిన మాదం భారతి భర్త సమ్మయ్య ఇటీవల మృతి చెందాడు. భర్త జీవించి ఉన్న సమయంలో తమకు ఉన్న 180 గజాల భూమిని పెద్ద కొడుకుకు అప్పగించారు. అతని నుంచి మరొకరు కొనుగోలు చేసి అదనపు భూమిని కలుపుకొని మొత్తం 230 గజాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని భారతి ఆరోపించారు. 

ఈ విషయంపై ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని, ములుగు పోలీస్‌‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు. దీంతో నిరాశ చెందిన భారతి బుధవారం కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బా పట్టుకొని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్ జీ ఆమెను పిలిపించి సమస్యను తెలుసుకున్నారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె వెళ్లిపోయారు.