డ్రైవర్, ప్రయాణికుని మధ్య గొడవ.. యువతి మృతి

డ్రైవర్, ప్రయాణికుని మధ్య గొడవ.. యువతి మృతి

మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు చేసిన నిర్వాకానికి ఓ యువతి ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. 

ముంబై పౌర సంస్థ BMCకి చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ముంబైలోని బల్లార్డ్ పీర్ నుండి సియోన్‌లోని రాణి లక్ష్మీబాయి చౌక్‌కు వెళ్తోంది. అదే బస్సులో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. బస్సు వేగంగా నడిపే విషయమై ప్రయాణికుడికి, బస్సు డ్రైవర్ కు మధ్య గొడవ మొదలైంది. ఇద్దరు మాటా మాటా అనుకున్నారు. ఇంతలో సహనం కోల్పోయిన ప్రయాణికుడు బస్సు స్టీరింగ్ ను ఇష్టమొచ్చినట్లు గిరాగిరా తిప్పాడు. 

ALSO READ | మా రాష్ట్రంలో 12 లక్షల మంది బంగ్లా దేశీయులు ఉన్నారు: శ్రీరామ్ సేన చీఫ్

దాంతో, బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొంటూ పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నూపుర్ మాన్యార్(28) అనే యువతి మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని దత్తా మురళీధర్ షిండే (40)గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో మురళీధర్ షిండే బలవంతంగా బస్సు స్టీరింగ్‌ను ఎడమ వైపుకు తిప్పినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ పాత్రపైనా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నూపుర్ మాన్యార్ ఆదాయపు పన్ను శాఖలో పనిచేసింది. ఆమె తండ్రి కోవిడ్ సమయంలో చనిపోగా.. తల్లి, చెల్లెలు ఆమెపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.