
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరద నీటికి గల్లంతై కొందరు, వానలకు తడిసి మట్టిగోడల కింద పడి మరికొందరు ప్రాణాలు విడుస్తున్నారు. సెల్లార్లలోకి వర్షపునీరు చేరడంతో నగరంలోని దిల్‌సుఖ్ నగర్ లో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పాత ఇళ్లు కూలిపోతున్నాయి. ఇప్పటికే పాతబస్తీలో ఇల్లు కూలి పలువురు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా పాతబస్తీలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. శాలిబండలో హఠాత్తుగా ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో గోడ పక్కన ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా కూలింది. గోడ కూలుతున్న సమయంలో వెంటనే మహిళ గమనించి పక్కకు పరిగెత్తింది. దీంతో ఆమె సేఫ్‌గా బయటపడింది. లేదంటే ఆ గోడ కింద పడి ఆమె ప్రాణాలు కోల్పోయేది. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి.