
- ఆమె వద్ద యూఎస్ పాస్‌పోర్ట్, తమిళనాడు ఆధార్ లభ్యం
- భర్తే కట్టేసినట్లు అనుమానిస్తున్న మహారాష్ట్ర పోలీసులు
ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప గొలుసులతో అడవిలో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. ఆమె ఆర్తనాదాలు విన్న ఓ గొర్రెల కాపరి పోలీసుల సాయంతో బాధితురాలని కాపాడాడు. ఈ ఘటన సింధుదుర్గ్ జిల్లా సోనుర్లి గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సోనుర్లి గ్రామ శివార్లలో ఓ వ్యక్తి గొర్రెలను మేపుతుండగా మహిళ అరుపులు వినిపించాయి. చుట్టుపక్కల వెతకగా నిర్మానుష్య ప్రాంతంలో గొలుసులతో ఓ మహిళ చెట్టుకు కట్టేసి ఉండటం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
వారు వచ్చి ఇనుప గొలుసులను కట్ చేశారు. మహిళ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆమె వద్ద అమెరికా పాస్‌పోర్ట్ కాపీ, తమిళనాడు అడ్రెస్ తో కూడిన ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలిని తమిళనాడుకు చెందిన లలితా కయీగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
డాక్యుమెంట్లు ద్వారా ఆమె పదేండ్లుగా భారత్ లోనే ఉన్నట్లు తెలుస్తున్నదని చెప్పారు. మహిళ చాలా బలహీనంగా ఉందని స్టేట్‌మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదని వివరించారు. ఎన్నిరోజులుగా ఆమె గొలుసులతో అడవిలో ఉందో తెలియడం లేదన్నారు. భర్తే ఆమెను అక్కడ కట్టేసి పారిపోయినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఇతర వివరాల కోసం తమిళనాడు పోలీసులను సంప్రదించామని, తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.