
బొడ్డు తెంచుకుని ప్రాణం పోసుకున్న బిడ్డ నుంచి ఆ తల్లిని కొన్ని గంటల్లోనే దూరంగా పెట్టింది కరోనా మహమ్మారి. ఇక కొద్ది రోజుల పాటు బిడ్డను ఎత్తుకుని ప్రేమగా లాలించే అవకాశం లేకుండా చేసింది. ఆస్రత్రిలో ప్రసవం అయిన రెండ్రోజుల తర్వాత ఆ మహిళకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తల్లీబిడ్డలను వేర్వేరుగా ఐసోలేషన్ లో పెట్టాల్సివచ్చింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది ఈ ఘటన.
రాంచీలోని సర్దార్ హాస్పిటల్ లో రెండ్రోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చిన మహిళకు కరోనా వైరస్ సోకినట్లు శుక్రవారం నిర్ధారణ అయిందని తెలిపారు వైద్య శాఖ అధికారులు. ఆ మహిళను రిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేస్తున్నామని చెప్పారు రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి.కశ్యప్. ఆమెకు బిడ్డను, ప్రసవం చేసిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని కూడా ఐసోలేషన్ లో ఉంచామన్నారు. వీరి శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపామని, ఇవాళ రిజల్ట్ తేలనుందని చెప్పారు.
తల్లి చనుబాలు పట్టొచ్చు
అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ బిడ్డను ఐసోలేషన్ లో ఉంచినట్లు తెలిపారు డాక్టర్ కశ్యప్. ఆ పసికందు నుంచి కూడా శాంపిల్స్ సేకరించి కరోనా టెస్టుకు పంపినట్లు చెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ, డబ్ల్యూహెచ్ఓ ప్రొటోకాల్ ప్రకారం చిన్నారి సంరక్షణ చూస్తున్నామని చెప్పారు. సరైన జాగ్రత్తలతో బిడ్డకు తల్లి చనుబాలు పట్టవచ్చని, వైద్య నిపుణులు, డాక్టర్లతో చర్చించిన తర్వాత తల్లిపాలతో ఎటువంటి సమస్య ఉండదని నిర్ధారించుకున్నామని వివరించారు.