డాక్టర్​ను చంపి..ఇంట్లో దోపిడీ

డాక్టర్​ను చంపి..ఇంట్లో దోపిడీ

అమీన్​పూర్​, వెలుగు: దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై దుండగులు దాడి చేసి హత్య చేయడం కలకలం రేపింది. కళ్లలో కారం చల్లి, గొంతు నులిమి చంపేసిన దుండగులు అందిన కాడికి దోచుకొని వెళ్లిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ దోపిడీ ఘటన అమీన్​పూర్​ప్రాంతాన్ని ఉలిక్కి పడేలా చేసింది.

పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ ​జిల్లా ముక్కరాజుపేటకు చెందిన సురేందర్​గౌడ్, అరుంధతి దంపతులు డాక్టర్లు. కొంత కాలంగా వీరు అమీన్​పూర్ మున్సిపాలిటీ​పరిధిలోని వాణినగర్ కాలనీలో కొత్తగా ఇల్లు కట్టుకొని నివాసముంటున్నారు. సురేందర్​గౌడ్​జహీరాబాద్​పరిధిలోని కోహిర్​లో డాక్టర్​గా పనిచేస్తుండగా, అతని భార్య అరుంధతి (58) రెండేళ్ల క్రితం ప్రాక్టీస్​ మానేసి ఇంట్లోనే ఉంటోంది. ఎప్పటిలాగే శుక్రవారం డ్యూటీకి వెళ్లిన సురేందర్ లేట్​ నైట్​లో ఇంటికి వచ్చాడు. ఇంట్లో లైట్లు ఆఫ్​చేసి ఉండటంతో లోపలికి వెళ్లి లైట్లు వేసి చూశాడు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటాన్ని గమనించాడు. బెడ్​రూం డోర్​ తీసి చూడగా అరుంధతి అచేతనంగా కనిపించింది. స్వతహాగా సురేందర్​ డాక్టర్​ కావడంతో పల్స్​ని పరిశీలించగా అరుంధతి చనిపోయింది. తన కొడుకుకు ఫోన్​చేసి, స్థానికులకు కూడా సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్​ టీంను రప్పించి  స్థలంలో దుండగుల ఆధారాలు సేకరించారు.

దోపిడీ దొంగల పనిగా అనుమానం

సంఘటన స్థలంలో ఆధారాలను బట్టి చూస్తే దోపిడి దొంగలే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నాం. మృతురాలి ఒంటిపై, కళ్లలో కారం ఉండటం, శరీరంపై ఎక్కడ గాయాలు లేకుండా కేవలం గొంతు వద్దే గాయం ఉండటం చూస్తే దొంగతనానికి వచ్చిన వారే చేసి ఉంటారనిపిస్తోంది. మృతురాలి ఒంటిపై బంగారం, బీరువాలోని నగలు, డబ్బు కూడా పోయినట్లుగా సురేందర్ గౌడ్​ ఫిర్యాదు చేశారు. కాలనీ చివరిగా ఉండటం, సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను అప్పుడే గుర్తించలేం. గతంలో రెండు నెలల క్రితం ఓ వ్యక్తి కత్తితో ఇంట్లోకి చొరబడ్డాడని సురేందర్​ చెప్పారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం.  – రాజేశ్వర్​రావు, డీఎస్పీ , పటాన్​చెరు