ఖమ్మం టౌన్‌‌‌‌లో ఘోరం: కిండర్ జాయ్ లో ఎలుకల మందు కలిపి... ఇద్దరు పిల్లలను చంపిన తల్లి..

ఖమ్మం టౌన్‌‌‌‌లో ఘోరం: కిండర్ జాయ్ లో ఎలుకల మందు కలిపి... ఇద్దరు పిల్లలను చంపిన తల్లి..
  • అదే మందు తిని తానూ ఆత్మహత్యా యత్నం
  • అత్తగారింటికి మకాం మార్చాలన్న విషయంలో భర్తతో గొడవ
  • పిల్లలను చంపి తానూ చనిపోవాలని క్షణికావేశంలో నిర్ణయం

ఖమ్మం టౌన్, వెలుగు: క్షణికావేశంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది. కిండర్‌‌‌‌‌‌‌‌ జాయ్‌‌‌‌లో ఎలుకల మందు కలిపి తినిపించి చంపేసింది. ఆపై అదే మందు తిని తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఖమ్మం జిల్లాలో ఆదివారం ఈ ఘోరం జరిగింది. ఖమ్మం రూరల్‌‌‌‌ మండలం గుర్రాలపాడుకు చెందిన బొబ్బల లింగరాజు, స్వాతికి పదేండ్ల కింద పెళ్లి కాగా, వీరికి ఇద్దరు కొడుకులు వేదిక్‌‌‌‌ కుమార్‌‌‌‌(7)‌‌‌‌, తనిష్క్‌‌‌‌(5) ఉన్నారు. ఖమ్మంలోని త్రీ టౌన్‌‌‌‌ ఏరియా చేపల మార్కెట్‌‌‌‌ వద్ద భార్యాపిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ లింగరాజు స్థానిక సెల్‌‌‌‌పాయింట్‌‌‌‌లో టెక్నీషియన్‌‌‌‌గా పనిచేస్తున్నారు. 

అయితే, భార్యాభర్తల మధ్య వివాదం నేపథ్యంలో స్వాతి తన ఇద్దరు పిల్లలకు శనివారం మధ్యాహ్నం కిండర్‌‌‌‌‌‌‌‌ జాయ్‌‌‌‌లో ఎలుకల మందు కలిపి తినిపించింది. ఆపై తాను కూడా తినేసింది. పని ముగించుకుని ఇంటికి వచ్చిన లింగరాజు.. పిల్లలిద్దరూ వాంతులు, తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటం చూసి మెడికల్‌‌‌‌ షాపు నుంచి సిరప్ తెచ్చి తాగించాడు. అయినా, నయం కాకపోవడంతో ఓ ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రికి, ఆపై సర్కారు దవాఖానాకు తీసుకెళ్లాడు. 

అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ పొందుతూ వేదిక్‌‌‌‌ ప్రాణాలు కోల్పోయాడు. చిన్న కొడుకు తనిష్క్‌‌‌‌ ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో తల్లి స్వాతిని లింగరాజు, కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీయడంతో పిల్లలకు ఎలుకల మందు తినిపించినట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించి తనిష్క్‌‌‌‌ చనిపోయాడు. ఇద్దరు కొడుకుల మృతిని చూసిన తల్లి స్వాతి తాను కూడా ఎలుకల మందు తిన్నానని చెప్పడంతో ఆమెను ఆదివారం ఖమ్మంలోని ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా సీరియస్‌‌‌‌గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. 

సొంతూరుకు వెళ్లడం ఇష్టం లేకనే.. 

వచ్చే జీతం సరిపోవట్లేదని, సొంతూరుకు వెళ్లి డైరీ ఫామ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ చేద్దామని స్వాతితో తరచుగా చెప్పేవాడినని లింగరాజు మీడియాకు తెలిపారు. ఊరికి వెళ్లి అక్కడే నివాసం ఉండాలన్న ఆలోచన ఆమెకు నచ్చేదికాదని, ఇదే విషయంలో పంతానికి పోయి ఆవేశంలో తన భార్య ఈ ఘోరానికి పాల్పడిందని వివరించారు. కాగా, చిన్నారుల మృతిపై లింగరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.