మహానగరంలో మాయ లేడి...ఆస్తికోసం ఏకంగా తహశీల్దార్ నే బురిడీ కొట్టించింది. చనిపోయిన వ్యక్తికి తానే భార్య అని..అత్తమామ కూడా చనిపోయారని ఫేక్ డాక్యుమెంట్లతో వాళ్ల ఆస్తిని అమ్మేసింది. ఈ ఘటన హైదరాబాద్ అల్వాల్ తహశీల్దార్ కార్యాలయంలో జరిగింది.
సైనిక్ పూరీకి చెందిన దాసరి లక్ష్మీ అనే మహిళ నకిలీ ధ్రువపత్రాలతో అల్వాల్ తహశీల్దార్ ను మోసం చేసింది. మృతి చెందిన ఓ వ్యక్తికి తానే భార్యనని నమ్మిస్తూ నకిలీ కుటుంబ ధ్రువపత్రాన్ని సృష్టించింది. వృద్ధులైన తన అత్తమామలు చనిపోయారని నమ్మించింది. తన భర్త చనిపోవడంతో పాటు ఆయన తండ్రి కూడా మరణించినట్లు నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి వారి పేరిట ఉన్న ఆస్తులను అమ్ముకుంది.
లక్ష్మి అత్తమామలైన రాములు,కాంతమ్మలు బతికి ఉన్నప్పటికీ వారు చనిపోయారని నకిలీ కుటుంబ ధృవపత్రాలను మీ సేవ ద్వారా పొందినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు అల్వాల్ తహసిల్దార్ ను ఆశ్రయించగా లక్ష్మీ చేసిన భాగోతం బయటపడింది. దీంతో అల్వాల్ తహశీల్దార్ లక్ష్మీ అనే మహిళపై అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళను పట్టుకునే పనిలో ఉన్నారు.
