
డెంగ్యూ..! పెళ్లి కూతురు ప్రాణం తీసింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం తిరు వెంకట నరసింహాపురంలో కావ్యకు వివాహం కావాల్సి ఉంది. వివాహం సందర్భంగా పెళ్లి కూతురిని చేస్తుండగా కావ్య ఒక్కసారి కుప్పకూలిపోయింది. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు పెళ్లి కూతుర్నిఅత్యవసర చికిత్స కోసం తమిళనాడు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి వేలూరు సీఎంసీ హాస్పిటల్‌కి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాధితురాలికి డెంగ్యూ జ్వరం వచ్చిందని, ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. అయితే చికిత్స పొందుతూ కావ్య మృతి చెందింది. కావ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి బాజా మోగాల్సిన ఇంట చావు డప్పు మోత వినాల్సిన పరిస్థితి ఏర్పడటంలో ఆ గ్రామంలో మరింత విషాదం చోటుచేసుకుంది. మరోవైపు తిరుపతి ఎస్వీ కాలేజీ విద్యార్థులకూ డెంగ్యూ లక్షణాలు ఉన్నాయని వైద్యులు తేల్చారు. కాలేజీ హాస్టల్‌లో నలుగురు విద్యార్థులకు డెంగ్యూ అని వైద్యులు నిర్ధారించారు.