కొంపముంచిన కౌగిలింత

కొంపముంచిన కౌగిలింత

చైనాలో సహోద్యోగి కౌగిలించుకున్నాడని ఓ మహిళ కోర్టుకెక్కింది. అతని హగ్ కారణంగా తన పక్కటెముకలు విరిగాయని కోర్టుకు విన్నవించింది. సదరు వ్యక్తి తన మెడికల్ ఖర్చులు చెల్లించేలా  ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం బాధితురాలికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 

చైనాలోని హునన్ ప్రావిన్స్ కు చెందిన ఓ మహిళ గతేడాది ఆఫీసులో తన కొలీగ్ తో మాట్లాడుతుండగా.. మరో సహోద్యోగి ఆమె వద్దకు వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. అతను బలమంతా ప్రయోగించి హగ్ చేసుకోవడంతో ఆమె బాధతో విలవిల్లాడిపోయింది. ఆ తర్వాత చాతీలో నొప్పిగా అనిపించడంతో కొన్ని వంటింటి చిట్కాలు పాటించింది. రోజులు గడిచినా నొప్పి తగ్గకపోవడంతో హాస్పిటల్ కు వెళ్లగా ఎక్స్ రే తీసిన డాక్టర్లు కుడివైపున 2, ఎడమవైపున ఒక పక్కటెముక విరిగినట్లు గుర్తించారు. అవసరమైన ట్రీట్మెంట్ చేసి కొన్నాళ్ల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఉద్యోగానికి సెలవు పెట్టడంతో ఆమె జీతం కోల్పోవడంతో పాటు మెడికల్ ఖర్చులు తడిసిమోపడయ్యాయి. 

సహోద్యోగి చేసిన పనికి ఆర్థికంగా నష్టపోయిన తనకు పరిహారం ఇప్పించాలంటూ సదరు మహిళ స్థానిక కోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పక్కటెముకలు విరిగేందుకు కారణమైన వ్యక్తి ఆమెకు 10,000 యువాన్లు (రూ.1,20,000) చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు చూసి సదరు వ్యక్తి లబోదిబోమన్నాడు. సదరు మహిళ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తాను ఎముకలు విరిగిపోయేంత గట్టిగా కౌగిలించుకోలేదని వాపోయాడు.