విమానం గాల్లో ఉండగా కరోనా పాజిటివ్

విమానం గాల్లో ఉండగా కరోనా పాజిటివ్

న్యూయార్క్:కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కట్టడి కష్టంగా మారుతోంది. కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో ప్రభుత్వాలు ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా విమానాల్లో కోవిడ్ నెగిటివ్ రిజల్ట్ వచ్చిన ప్రయాణీకులనే అనుమతిస్తున్నాయి. తాజాగా అమెరికాలో ఓ విమానంలో ఊహించని ఘటన జరిగింది. ఫ్లైట్ ఎక్కే ముందు కోవిడ్ టెస్ట్ రిజల్ట్ నెగిటివ్ గా వచ్చిన మహిళకు విమానం టేకాఫ్ అయ్యాక పాజిటివ్ గా తేలింది. అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది ఆమెను ఐదు గంటల పాటు బాత్రూంలో ఐసోలేట్ చేశారు.

అనుమానంతో ఫ్లైట్ లో ర్యాపిడ్ టెస్ట్
మిచిగాన్ కు చెందిన మారీసా ఫోటియో అనే మహిళ టీచర్. డిసెంబర్ 19న ఆమె తన తండ్రి, సోదరుడితో కలిసి చికాగో నుంచి ఐస్లాండ్ కు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కింది. విమానం ఎక్కడానికి ముందు రెండుసార్లు ఆర్టీ పీసీఆర్, ఐదుసార్లు ర్యాపిడ్ టెస్ట్లు చేయించుకోగా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. విమానం గాల్లోకి ఎగిరిన గంటన్నర తర్వాత ఆమెకు గొంతునొప్పి ప్రారంభమైంది. అనుమానంతో ఫ్లైట్ లోని బాత్రూంలోకి వెళ్లి కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేసుకోగా.. కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. అది చూసి షాక్కు గురైన మారీసాకు ఏడుపు ఆగలేదు. తొలుత ఆందోళనకు గురైనా ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని విషయాన్ని ఫ్లైట్ సిబ్బందికి తెలిపింది.

ఫ్లైట్ బాత్రూంలో 5 గంటలు
ఫ్లైట్లో మహిళకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో అప్రమత్తమైన సిబ్బంది మారిసాను బాత్రూలోనే స్వీయ నిర్భంధంలో ఉండాలని సూచించారు. తన కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణీకుల ఆరోగ్యం దృష్ట్యా ఆమె అందుకు అంగీకరించింది. విమానం ఐస్లాండ్ కు చేరుకునే వరకు దాదాపు 5 గంటల పాటు బాత్రూంలోనే ఐసోలేషన్ లో ఉండిపోయింది. ఫ్లైట్ ల్యాండై ప్రయాణీకులందరూ దిగిపోయాక చివరగా ఆమెను బయటకు తీసుకువచ్చారు. ఎయిర్పోర్టులో మారీసాతో పాటు ఆమె తండ్రి, సోదరునికి ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా మారీసాకు మాత్రమే పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో ఆమె తండ్రి, సోదరుడిని కనెక్టింగ్ ఫ్లైట్ కు స్విట్జర్లాండ్ వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ఆ తర్వాత ఆమెను 10 రోజుల క్వారంటైన్ కోసం హోటల్ కు తరలించారు. ఫ్లైట్లో తనకు ఎదురైన అనుభవాన్ని మారీసా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇదిలా ఉంటే మారీసా రెండు డోసుల వ్యాక్సీన్ తో పాటు బూస్టర్ డోస్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడటం గమనార్హం.

For more news..

వైన్ షాపుల ముందు భారీ క్యూ

టెక్స్‌టైల్‌పై జీఎస్టీ రేటు పెంచలె