పద్మారావునగర్ లో మహిళ  హల్​చల్ .. పలువురిని బెదిరించి డబ్బులు వసూలు 

పద్మారావునగర్ లో మహిళ  హల్​చల్ .. పలువురిని బెదిరించి డబ్బులు వసూలు 

పద్మారావునగర్, వెలుగు :  బస్టాండ్​లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని.. ఆపై ఇంటికి వెళ్లి బ్లాక్​మెయిల్​చేస్తూ డబ్బులు లాగుతున్న కిలేడీ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిలకలగూడ పోలీసులు తెలిపిన ప్రకారం.. పద్మారావునగర్​కు చెందిన కృష్ణన్ దక్షిణామూర్తి(61) ప్రైవేట్​ఎంప్లాయ్. గత నెలలో ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు సికింద్రాబాద్ రేతిఫైల్​బస్టాండ్​లో బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు.

అతని వద్దకు ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి బస్సు గురించి అడుగుతూ, తన పర్సనల్​వివరాలు చెప్పింది.  బస్సు రాగానే  దక్షిణామూర్తి ఎక్కేందుకు ప్రయత్నించగా ఆమె అడ్డుకుని రూ. 5వేలు ఇవ్వాలని డిమాండ్​చేసింది. నిరాకరించిన అతడు బస్సు ఎక్కడంతో ఆమె కూడా అదే బస్సు ఎక్కింది. పద్మారావునగర్​బస్టాప్​లో అతనితో పాటు దిగింది. డబ్బులను ఇవ్వాలని, లేదంటే కేసు పెడతానని, పోలీసు అధికారులు తెలుసని అతడిని భయపెట్టింది. దీంతో బాధితుడు ఏటీఎంకు వెళ్లి రూ.10 వేలు డ్రా చేసుకుని రాగా, ఆమె లాక్కోని వెళ్లిపోయింది.

మళ్లీ వారం తర్వాత బాధితుడి ఇంటికి వెళ్లింది. అతడి భార్యను బ్లాక్​మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది. ఇలా పలుమార్లు వెళ్లగా బాధితుడు చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి కంప్లయింట్ చేశాడు. దర్యాప్తులో భాగంగా ఆమెను అరుణ అలియాస్​భాగ్యగా గుర్తించారు. ఇలాగే పలువురిని బ్లాక్​మెయిల్​చేసి డబ్బులు తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. స్టేషన్ కు రావాలని ఆమెకు పోలీసులు నోటీసులు అందజేశారు.