నర్మదా నది నీటిపై నడిచిన మహిళ..వీడియో వైరల్

నర్మదా నది నీటిపై నడిచిన మహిళ..వీడియో వైరల్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ జిల్లాలో నర్మదా నది నీటిపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తిల్వారా ఘాట్ వద్ద నర్మదా నీటిపై నడుస్తున్న మహిళ  అనే క్యాప్షన్తో  ఈ  వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో ఆమెను చూసేందుకు జనాలు భారీగా చేరుకున్నారు. ఆ మహిళ నర్మదా నదీ జలాల మీద నడించిందని..ఆమె నర్మదా మాత రూపం అంటూ ప్రార్థనలు..పూజలు చేశారు. 

డప్పులు..పూజలు..

నర్మదా నదిలో నడుస్తూ వచ్చిన వృద్ధురాలికి స్వాగతం చెప్పడానికి ప్రజలు భారీగా అక్కడకు చేరుకున్నారు. మహిళ చుట్టూ చేరి డప్పులు వాయించారు. ఆమెను దేవత  కొలుస్తూ.. ఆశీర్వాదం తీసుకునేందుకు క్యూ కట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నర్మదా నది ఒడ్డుకు చేరుకుని విచారణ చేపట్టారు. ఆ తర్వాత మహిళణు సురక్షిత ప్రాంతానికి  తీసుకెళ్లి రక్షణ కల్పించారు.

ఎవరామె..

ఆ మహిళ పేరు జ్యోతి రఘువంశీ. నర్మదాపురన్ ప్రాంతానికి చెందిన మహిళ. ఆమె 10 నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. ఈ విషయాలన్ని మహిళనే తెలిపింది. అంతేకాదు తాను నర్మదా నదీ నీటిపై నడవలేదని చెప్పి షాక్ ఇచ్చింది. తాను సామాన్యురాలిని అని.. ఎలాంటి అతీంద్రియ శక్తులు లేవని  మహిళ చెప్పడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

నర్మదా నదిపై నిజంగానే నడిచిందా..

జ్యోతి రఘువంశీ అనే మహిళ నర్మదా నది నీటిపై నడవడం వెనుక మిస్టరీ వీడింది. నదిలో చాలా చోట్ల  నీటి మట్టం  మారుతూ ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో నీటి మట్టం తక్కువగా..మరి కొన్ని చోట్ల ఎక్కువగా కూడా ఉంటుంది. అయితే నీటి మట్టం తక్కువగా ఉన్న ప్రదేశంలోనే జ్యోతి రఘువంశీ నడిచినట్లు తేలింది. అంతేకాదు  పోస్టు క్యాప్షన్లో పేర్కొన్నట్టు ఆ వీడియోను తిల్వారా ఘాట్ వద్ద తీయలేదని స్పష్టమైంది. భక్తురాలైన జ్యోతి రఘువంశీ నర్మదా నది దగ్గర ప్రదక్షిణ చేసేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆమె నది ఒడ్డున నీటిలోనే నడిచింది.  నీటి మట్టం తక్కువగా ఉండటంతో కొద్దిగా లోపలికి  వెళ్లింది. అయితే దీనినే పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.