వీడియో వైరల్: నిండు గర్భిణీ కేవలం 5 నిమిషాలు, 25 సెకన్లలో 1.6 కి.మీ.

వీడియో వైరల్: నిండు గర్భిణీ కేవలం 5 నిమిషాలు, 25 సెకన్లలో 1.6 కి.మీ.

న్యూఢిల్లీ: రోజు మొత్తం పనులతో సతమవుతూ గజిబిజీగా ఉండే ఈ రోజుల్లో ఫిట్‌నెస్‌‌కు కొంత సమయం తప్పక కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. నడక, పరుగును అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్లు నడవడం సులువే కానీ ఎక్కువ దూరం అదీ వేగంగా రన్నింగ్ చేయడం మాత్రం కష్టమే. కానీ ఇక్కడో మహిళ 1.6 కి.మీ.ల దూరాన్ని 5.25 నిమిషాల్లో పూర్తి చేసి ఔరా అనిపించింది. ఇందులో విశేషం ఏముందని అంటారా? పరిగెత్తిన మహిళ నిండు గర్భిణి కావడం గమనార్హం.

కడుపులో బిడ్డను పెట్టుకొని పరుగు పందెంలో పాల్గొనడమే గొప్ప అనుకుంటే.. అంత వేగంగా చేరుకోవడం అంత దూరం పరిగెత్తడం అంటే మాటలా మరి. సాధారణంగా 1.6 కి.మీ.ల దూరాన్ని చేరుకోవాలంటే 9 నుంచి 10 నిమిషాలు పడుతుంది. అలాంటిది 28 ఏళ్ల మెకెన్నా మైలర్ అనే సదరు గర్భిణి 5.25 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. భర్త ఉత్సాహపరుస్తుండగా మైలర్ హుషారుగా పరిగెత్తింది.  మైలర్ ప్రొఫెషనల్ అథ్లెట్. ఆమె తన జీవితాన్ని ఫిట్‌‌నెస్‌‌కు అంకితం చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి భయంతోపాటు ప్రెగ్నెన్సీ కారణంగా మైలర్ తన డైట్‌‌ను పూర్తిగా మార్చుకుంది. గర్భిణి అంత దూరం వేగంగా పరిగెత్తడం సురక్షితమా కాదా అనేగా మీ సందేహం. పరుగెత్తొచ్చని మెడికల్ ప్రొఫెషనల్స్ అనుమతి ఇచ్చాకే మెకెన్నా ఈ ఫీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌‌లో వైరల్ అవుతోంది. ఆమె పరుగుకు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.