అయ్యో పాపం : చెప్పులకు డబ్బులు లేక ప్లాస్టిక్ కవర్లు..

అయ్యో పాపం : చెప్పులకు డబ్బులు లేక ప్లాస్టిక్ కవర్లు..

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి గడప దాటాలంటేనే జనం భయపడిపోతున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో  బయటకు రావాలంటే కాళ్లకు చెప్పులు.. గొడుగు లాంటివి తీసుకొని వాటర్ బాటిల్ సంచిలో పెట్టుకొని బయటకు వస్తారు. ఈ పరిస్థితుల్లో రోడ్లపై చెప్పులతో నడవాలంటేనే కష్టం. అలాంటిది ఏకంగా చెప్పులు లేకుండా కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు చుట్టుకుని నడిస్తే... అది ఊహించడానికే కష్టంగా వుంటుంది. కాని ఇది నిజం .కాని తాజాగా ఓ మహిళ తన ఇద్దరి పిల్లలను ఎర్రటి ఎండలో రోడ్లపైకి చెప్పులు లేకుండా తీసుకొచ్చింది.  ఆ పిల్లల బాధను చూడలేక కాళ్లకు  ప్లాస్టిక్ కవర్లు చుట్టి నడిపించుకుంటూ రోడ్లపై తిరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఓ మహిళ తన పేదరికం కారణంగా పిల్లలకు చెప్పులు కొనలేని పరిస్థితుల్లో వారి పాదాలకు పాలిథిన్ కవర్లను చుట్టింది.

 వివరాల్లోకి వెళితే...

రుక్మిణి అనే మహిళ  మే 21న మధ్యాహ్నం షియోపూర్ నగరంలోని రోడ్లపై తన పిల్లలతో కలిసి  వెళ్తుండగా.. ఇన్సాఫ్ ఖురేషీ అనే జర్నలిస్ట్ వారిని గమనించి ఫోటో తీశాడు. రుక్మిణీ ఆమె పిల్లల దీనస్థితికి చలించిపోయిన ఖురేషి ఆ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేయడమే కాకుండా వారు పాదరక్షలు కొనుక్కునేందుకు వీలుగా నగదు అందించాడు. సహరియా రిబల్ కమ్యూనిటీకి చెందిన రుక్మిణి తన ఆర్ధిక పరిస్ధితులను ఆయనకు వివరించింది. తన భర్త క్షయ వ్యాధితో బాధపడుతున్నారని.. ఆయన వైద్యం కోసం ఉన్నదంతా ఖర్చు చేశామని రుక్మిణి చెప్పింది.

పనిని వెతుక్కుంటూ..

ఇలాంటి పరిస్ధితుల్లో కుటుంబ పోషణ కోసం నగరంలో ఏదైనా పని వెతుక్కుందామని వచ్చినట్లు ఆమె పేర్కొంది. తన ముగ్గురు పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేకోపవడంతో .. వారిని కూడా తన వెంట తీసుకొచ్చినట్లు రుక్మిణి చెప్పింది. రుక్మిణి పరిస్ధితిని తెలుసుకున్న స్థానిక అధికార యంత్రాంగం వారిని అదుకునేందుకు ముందుకు వచ్చింది. వీరి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు గాను మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు సిబ్బందిని పంపారు. రుక్మిణి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వివరిస్తామని షియోపూర్ కలెక్టర్ శివమ్ వర్మ  తెలిపారు.