
హాంగ్జౌ (చైనా): విమెన్స్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఇండియా అమ్మాయిల జట్టు తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన సూపర్ –4 రౌండ్ తొలి మ్యాచ్‌లో ఇండియా 4-2తో సౌత్ కొరియాపై అద్భుత విజయం అందుకుంది. వైష్ణవి విఠల్ ఫాల్కే (2వ నిమిషం), సంగీత కుమారి (33వ ని), లాల్‌రెమ్‌సియామి (40వ ని), రుతుజ దాదాసో పిసల్ (59వ ని) తలో గోల్ చేశారు. కొరియా తరఫున యుజిన్ కిమ్ (33వ, 53వ ని) డబుల్ గోల్స్ కొట్టింది.
పూల్ దశలో టాప్ ప్లేస్‌లో నిలిచిన ఇండియా ఈ పోరులో స్టార్టింగ్ నుంచే అదరగొట్టింది. రెండో నిమిషంలోనే ఇండియాకు పెనాల్టీ కార్నర్ లభించింది. ఉదిత కొట్టిన షాట్‌ను కొరియా గోల్‌కీపర్ అడ్డుకోగా రీబౌండ్ అయినా బాల్‌ను వైష్ణవి గోల్‌పోస్టులోకి పంపి జట్టుకు1–--0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత కూడా పలు పెనాల్టీ కార్నర్స్ సంపాదించినా వాటిని గోల్స్‌గా మలచడంలో ఇండియా విఫలమైంది. ఫస్టాఫ్ చివర్లో ఇండియా గోల్‌కీపర్ బిచు దేవి ఓ అద్భుతమైన సేవ్ చేసి ఆధిక్యాన్ని కాపాడింది.
సెకండాఫ్ మొదలైన వెంటనే సంగీత కుమారి ఫీల్డ్ గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కి పెంచింది. అయితే, అదే నిమిషంలో కొరియాకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను యుజిన్ కిమ్ గోల్‌గా మార్చింది. 40వ నిమిషంలో లాల్‌రెమ్‌సియామి మంచి ఫీల్డ్ గోల్‌తో ఇండియా ఆధిక్యాన్ని 3-1 పెంచింది. 53వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ ద్వారా యుజిన్ కిమ్ మరో గోల్ చేయడంతో కొరియా పోటీలోకి వచ్చింది. ఆ జట్టుకు మరో అవకాశం ఇవ్వని ఇండియా చివరి నిమిషంలో రుతుజ చేసిన గోల్‌తో ఘన విజయం సొంతం చేసుకుంది. గురువారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఆతిథ్య చైనాతో ఇండియా తలపడనుంది.