HIV ఉందని చెప్పంది..రేప్ నుంచి తప్పించుకుంది

HIV ఉందని చెప్పంది..రేప్ నుంచి తప్పించుకుంది

ఔరంగాబాద్ : కామాంధుడి చెర నుంచి తప్పించుకోవడానికి ఓ అద్భుతమైన ఐడియాతో బయటపడింది ఓ మహిళ. చిమ్మచీకటి, రాత్రి 11దాటింది. నిర్మానుష్య ప్రాంతం. అరుపులు వేసినా కాపాడటానికి ఎవ్వరూరారని గమనించింది. ఆమెపై రేప్ చేయడానికి యత్నించాడు. ఆ మగమృగం నుంచి తప్పించుకోవాలంటే ఏంచేయాలా అని ఆలోచించింది. ఆమెపై చేయి వేసే సమయంలోనే నవ్వుతూ ..ఇద్దరం కలిసి చనిపోదాం రా అంటూ మాట్లాడింది. ఏమంటున్నావ్ అని అతడు అడుగగా..తనకు ఎయిడ్స్ ఉందని తెలిపింది. అంతే సంగతులు రేప్ చేయడానికి వచ్చిన ఆ కామాంధుడు బైక్ స్టార్ట్ చేసుకుని తుర్రుమన్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని,  ఔరంగాబాద్ లో జరుగగా  ఆ మహిళపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఔరంగాబాద్‌ కు చెందిన మహిళ తన ఏడేళ్ల కుమార్తెతో కలిసి మార్చి 25న షాపింగ్‌కు వెళ్లింది. షాపింగ్ పూర్తయ్యేటప్పటికీ ఆమె దగ్గర రూ.10లే మిగిలాయి. దీంతో ఇంటికి షేరింగ్ ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే రాత్రి కావడంతో ఎంతసేపటికీ ఆటోలు రాలేదు. బాగా చీకటి కావడంతో ఇంటికి వెళ్లేందుకు ఓ బైకర్‌ ను లిఫ్ట్ అడిగింది. తనను ఇంటి వద్ద దించాలని కోరగా అతడు ఆమెను, బాలికను ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లాక అతడిలోని కామాంధుడు నిద్రలేచాడు. నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించగా కత్తితో బెదిరించి లొంగదీసుకోవాలనుకున్నాడు.

అలాంటి నిస్సహాయ స్థితిలో ఆమె మెదడు చురుగ్గా పనిచేసింది. దీంతో తాను HIV పాజిటివ్ అని, కొన్నాళ్లుగా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పింది. దీంతో ఆ కామాంధుడికి చెమటలు పట్టాయి. కత్తిని అక్కడే పడేసి బైక్‌పై తుర్రుమన్నాడు. దీంతో తేరుకున్న బాధితురాలు వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేసన్‌కు వెళ్లి జరిగిందంతా వివరించి ఫిర్యాదు చేసింది. వాడి చేతులపై టాటూలు కూడా ఉన్నాయని గుర్తులు చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్రంగా గాలించి, నిందితుడిని పట్టుకున్నారు. వాడిని ముకుంద్‌వాడి ప్రాంతంలోని రాజ్‌ నగర్‌లో నివాసముండే 22ఏళ్ల కిషోర్ విలాస్ అవ్‌హద్‌ గా గుర్తించారు. తన తండ్రి హత్యకేసులో జైలుకెళ్లొచ్చాడని తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి అత్యాచారయత్నంతో పాటు పోస్కో చట్టం కింద కేసులు నమోదుచేశారు. ఆపద సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించిన ఆ మహిళను పోలీసులు అభినందించారు.