
- కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం..
- ఇప్పటివరకు 28 మంది మృతి..98 మందిని రక్షించారు
జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. మారుమూల ప్రాంతమైన చోసిటీలో గురువారం (ఆగస్టు14) క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వరదలు సంభవించాయి. వరదల్లో చోసిటీ గ్రామం సగం కొట్టుకుపోయింది. ఇండ్లు బురద, కొండరాళ్లకింద చిక్కుకుపోయాయి. చోసిటీ గ్రామస్తులతోపాటు మచైల్ మాతా ఆలయానికి వచ్చిన అనేక మంది భక్తులు వరదల్లో చిక్కుకున్నారు. 28 చనిపోయారు. 90మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. ఇంకా చాలామంది వరదల్లో కొట్టుకుపోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు.
కిష్త్వార్ జిల్లాలో మారుమూల గ్రామమైన చోసిటీ.. మచైల్ మాతా ఆలయానికి వెళ్లే మార్గంలో చివరి గ్రామం.. గురువారం మచైల్ చండీ మాతను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా కొండచరియలు విరిగిపడి చోసిటీ గ్రామం సగం బురద, మట్టి, కొండరాళ్లతో కప్పేసింది. వీటికి చాలా మంది చిక్కుకున్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన ఈ విధ్వంసంతో జమ్మూకాశ్మీర్ లోని చోసిటీ ప్రాంతం అతలాకుతలం అయింది. కొండచరియలు విరిగిపడి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో మచైల్ చండీ మాతా యాత్రను అధికారులు అర్థంతరంగా ముగించారు. జూలై 25 న ప్రారంభమైన ఈ యాత్ర.. సెప్టెంబర్ 5 న ముగియాల్సి ఉండగా.. గురువారం జరిగిన క్లౌడ్ బరస్ట్ విధ్వంసంతో మచైల్ చండీ మాత ఆలయానికి యాత్రను మధ్యంతరంగా ముగించారు.
మరోవైపు ఈ క్లౌడ్ బరస్ట్ విధ్వంసంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 28 మంది చనిపోయారు. వారి మృతదేహాలను వెలికితీశారు. 98 మందిని రక్షించారు. ఈ విపత్తులో ఇద్దరు CISF సిబ్బంది మరణించారని అధికారులు తెలిపారు. NDRF, SDRF, పోలీసులు, సైన్యం ,స్థానిక స్వచ్ఛంద సేవకులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు.
కిష్త్వార్ క్లౌడ్ బరస్ట్..కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్
కిష్త్వార్‌లోని చోసిటీ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల తరువాత బాధితులను ఆదుకునేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధితులకోసం కంట్రోల్ రూమ్ -కమ్-హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. విపత్తు సంభవించిన చోసిటి గ్రామం నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న పద్దర్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్లు: 9858223125, 6006701934, 9797504078, 8492886895, 8493801381, 7006463710.