- 40 కోట్ల మంది అవసరమంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: మనదేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 14 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే శ్రామికుల్లో మహిళల సంఖ్య విపరీతంగా పెరగాలని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఇప్పుడున్న వర్క్‌ఫోర్స్‌లో అదనంగా 40 కోట్ల మంది మహిళలకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. 2047 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రస్తుత మహిళా కార్మిక భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్) 37 శాతం నుంచి 70 శాతానికి దాదాపు చేరాలని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ డిస్టిలేషన్ రిపోర్ట్ స్పష్టం చేసింది.
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆధారంగా దీనిని రూపొందించారు. దీని ప్రకారం..2047 నాటికి మనదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంలో గణనీయమైన పెరుగుదల అవసరం. అయితే 2047 నాటికి 11 కోట్ల మంది మహిళలు మాత్రమే శ్రామిక శక్తిలో చేరుతారని అంచనా. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అదనంగా 14.5 కోట్ల మందిని వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకురావాలి.
మహిళలకు ఉద్యోగ భద్రత తక్కువే...
ఉద్యోగ భద్రత విషయంలో స్త్రీపురుషుల మధ్య తీవ్ర అసమానతలు ఉన్నాయి. మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఏడు రెట్లు ఎక్కువ. ఉద్యోగం పోతే కోలుకునే అవకాశాలు పదకొండు రెట్లు తక్కువగా ఉన్నాయి. 2020 నాటి లెక్కలను గమనిస్తే 2019లో ఉపాధి పొందిన మహిళల్లో దాదాపు సగం మంది వర్క్‌ఫోర్స్‌ను విడిచిపెట్టారు. వనితలు ప్రధానంగా వ్యవసాయం, తయారీ రంగం వంటి తక్కువ ఉత్పాదక రంగాలలో పని చేస్తారు. వీటిలో పురోగతికి అవకాశాలు తక్కువ. నిర్మాణంరంగ శ్రామికుల్లో మహిళల సంఖ్య కేవలం 12 శాతమే ఉంది. నైపుణ్యం లేని ఉద్యోగాల్లో పురుషుల కంటే చాలా తక్కువ సంపాదిస్తున్నారు. కరోనా ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేసింది.
ఏం చేయాలంటే..
ఈ సవాళ్లను పరిష్కరించడానికి, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచడానికి రిపోర్ట్ మూడు సిఫార్సులు చేసింది. నైపుణ్యాల ఆధారంగా శ్రమ విభజన జరగాలి. అర్హతను బట్టి మహిళలకు సరైన ఉద్యోగాలు ఇవ్వాలి. రెండవది, డిజిటల్ కామర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా వ్యవస్థాపక అవకాశాలను పెంపొందించాలి. మూడవది, లేబర్ మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి మొబిలిటీ, డిజిటల్ యాక్సెస్ లేకపోవడం వంటి అడ్డంకులను పరిష్కరించాలి.