సింగరేణి డంపర్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్లుగా.. మహిళలకు చాన్స్‌‌‌‌‌‌‌‌

సింగరేణి డంపర్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్లుగా.. మహిళలకు చాన్స్‌‌‌‌‌‌‌‌
  • ఇప్పటికే ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసుకున్న 13 మంది మహిళలు
  • త్వరలోనే నియామకపత్రాలు అందుకొని డ్యూటీలోకి..

హైదరాబాద్, వెలుగు: ఇప్పటివరకు మగవారికే పరిమితం అయిన సింగరేణి ఓపెన్‌‌‌‌‌‌‌‌ కాస్డ్‌‌‌‌‌‌‌‌ గనుల డంపర్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాల్లోకి మహిళలు సైతం రానున్నారు. సింగరేణి సంస్థ ఎంపిక చేసిన 13 మంది మహిళలకు ఇప్పటికే ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తి అయింది. వీరంతా త్వరలోనే నియామకపత్రాలు అందుకొని డ్యూటీలో చేరనున్నారని సింగరేణి యాజమాన్యం గురువారం ప్రకటించింది. క్లిష్టమైన ఈ వృత్తిలోకి మహిళలు రావడం ప్రభుత్వ ప్రోత్సాహానికి నిదర్శనమని సంస్థ ప్రకటించింది.

బొగ్గు, ఓవర్‌‌‌‌‌‌‌‌ బర్డెన్‌‌‌‌‌‌‌‌ మట్టిని క్వారీ నుంచి భూ ఉపరితలానికి రవాణా చేయడానికి సింగరేణి సంస్థ 60 నుంచి 100 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ డంపర్లను వినియోగిస్తోంది. ఈ డంపర్లను నడపడం కష్టంతో కూడుకోవడంతో పాటు శారీరక దృఢత్వం, డ్రైవింగ్ నైపుణ్యం అవసరం అవుతాయి. పైగా మండే ఎండలు, భారీ వర్షాలు, తీవ్రమైన చలి పరిస్థితులను సైతం తట్టుకొని మూడు షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ కారణాల వల్ల ఓపెన్‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌ గనుల్లో గత యాభై ఏండ్లుగా పురుష ఆపరేటర్లు మాత్రమే భారీ డంపర్లను నడుపుతున్నారు. 

13 మంది మహిళలకు ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌
సింగరేణి సంస్థ కొన్ని డంపర్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం అర్హత కలిగిన వారి నుంచి అప్లికేషన్లు తీసుకుంది. దరఖాస్తులను స్వీకరించింది. భారీ డంపర్లను నడిపేందుకు సాధారణ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ లైసెన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు హెవీ లైసెన్స్ కూడా ఉండాలి. ఈ డంపర్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌ పోస్టులకు సుమారు 35 మంది మహిళలు అప్లై చేసుకున్నారు. 

మహిళల ఆసక్తిని గమనించిన సింగరేణి యాజమాన్యం సిరిసిల్లలో ఉన్న తెలంగాణ ఇన్స్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ స్కిల్స్‌‌‌‌‌‌‌‌ (టైడ్స్) అనే సంస్థ ద్వారా, కంపెనీ ఖర్చులతోనే భారీ వాహనాల డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌లో వారికి శిక్షణ ఇప్పించింది. ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ను సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా పూర్తి చేసుకున్న 13 మంది మహిళలు తాము డంపర్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీకి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వీరందరికీ త్వరలో జరగబోయే డంపర్ ఆపరేటర్ల నియామకల్లో అవకాశం కల్పించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

విప్లవాత్మకమైన మార్పు
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో సింగరేణి సంస్థ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. పురుషులకు మాత్రమే పరిమితమైన కఠినమైన పనుల్లో మహిళలకు సైతం ప్రాధాన్యం ఇస్తున్నాం. సింగరేణి సంస్థ తొలిసారిగా డంపర్ ఆపరేటర్లుగా మహిళలకు కూడా అవకాశం కల్పిస్తోంది.

13 మందికి శిక్షణ ఇచ్చి వీరిని త్వరలోనే ఉద్యోగంలో చేర్చుకోబోతున్నాం. మహిళల అభ్యున్నతికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

బుద్ధ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌ జ్యోతి, సింగరేణి సీఎండీ