రాజ్యాంగంతోనే మహిళలకు హక్కులు

రాజ్యాంగంతోనే మహిళలకు హక్కులు
  • తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌‌పర్సన్‌‌ వెన్నెల గద్దర్‌‌ కామెంట్
  • తమ హక్కుల సాధనకు నిత్యం పోరాడాలని పిలుపు 

ఆసిఫాబాద్, వెలుగు : మతాల ద్వారా మహిళలకు హక్కులు రాలేదని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోనే రాష్ట్రపతి, ప్రధాని, సీఎం, మంత్రి వంటి పదవులు పొందారని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌‌పర్సన్‌‌ వెన్నెల గద్దర్‌‌ పేర్కొన్నారు. తమ హక్కుల కోసం మహిళలు నిత్యం పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్‌‌ జిల్లా కెరమెరి మండలం ఝరి గ్రామంలో శక్తి అభియాన్, ఇందిరా ఫెలోషిప్ సభ్యులకు శుక్రవారం ఒకరోజు జిల్లాస్థాయి బూత్ క్యాంప్ వర్క్ షాప్ ను నిర్వహించారు. 

కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ చార్జ్, శక్తి అభియాన్ కో– ఆర్డినేటర్ ఆత్రం సుగుణతో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు.  స్త్రీ లేకపోతే సమాజమే లేదని, దేశ నిర్మాణంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. శక్తి అభియాన్ లో భాగంగా ఉమెన్ ఎంపవరింగ్ ట్రాన్స్ ఫార్మింగ్ పాలిటిక్స్ లక్ష్యంతో ఇందిరా ఫెలోషిప్ సంస్థని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఏర్పాటు చేసినట్టు ఆత్రం సుగుణ తెలిపారు. 

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ, నగరాల్లోని అన్నివర్గాల మహిళలను ఎంపిక చేసుకుని, ఇందిరా ఫెలోషిప్ పేరిట ఆర్థికసాయం అందించడం, రాజకీయాల్లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం సంస్థ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఇందిరా ఫెలోషిప్ నేషనల్ అడ్వైజర్ సౌజన్య, రాష్ట్ర కో – ఆర్డినేటర్ శివలాల్, ఆల్ ఇండియా కో – ఆర్డినేటర్ లక్ష్మి, ఆసిఫాబాద్ జిల్లా కో– ఆర్డినేటర్ ఇందిరా, నిర్మల్ జిల్లా కో– ఆర్డినేటర్ వేణి, జగిత్యాల జిల్లా కో– ఆర్డినేటర్ సోయం పద్మ తదితరులు పాల్గొన్నారు.