
- వరినాటు వేసేందుకు వెళ్లగా ఉప్పొంగిన దిందా వాగు
కాగజ్ నగర్, వెలుగు: జోరు వాన, అడవిలో దారి తెలియక కూలీలు నరకయాతన పడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం దిందా గ్రామస్తులు పోడు వ్యవసాయం చేసుకుని జీవిస్తుంటారు. వానాకాలం సీజన్ లో పోడు భూముల సాగులో అటవీశాఖ, రైతుల మధ్య వివాదం నెలకొంది. సమస్య కొలిక్కి రాకపోవడంతో పనులు దొరకడం లేదు.
దీంతో పక్క గ్రామాలైన కేతిని, గూడెంలో కూలీ పనులకు వెళ్తుండగా.. బుధవారం పన్నెండు మంది మహిళా కూలీలు గూడెం గ్రామానికి చెందిన రైతు పొలంలో వరి నాట్లు వేసేందుకు దిందా వాగు దాటి వెళ్లారు. అనంతరం వాగు ఉధృతి పెరిగిపోయింది. సాయంత్రం వారంతా ఇండ్లకు తిరిగి వచ్చే అవకాశం లేకపోవడంతో గూడెంలోనే రాత్రి ఉండిపోయారు.
గురువారం ఉదయం ఇండ్లకు వచ్చేందుకు వాగు వద్దకు వచ్చి చూడగా దాటే అవకాశం లేకుండా పోయింది. దీంతో గూడెం నుంచి బొలెరోలో మండలంలోని కోర్సినికి చేరుకొని, అక్కడనుంచి అడవిలోంచి సుమారు12 కిలోమీటర్లు సుమారు ఆరుగంటల పాటు నడిచారు. తమ వాళ్ల కోసం గ్రామస్తులు అడవిలోకి ఎదురెళ్లినా సిగ్నల్స్ సమస్యతో ఫోన్లు కలవకపోవడంతో ఆందోళన చెందారు. సాయంత్రం 4 గంటల సమయంలో అడవిదాటి బయటకు రావడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.