
వెండి రాఖీలు చూశారు..బంగారంతో చేసిన రాఖీలను.. వజ్రాలు పొదిగిన రాఖీలను కూడా కట్టుకున్నారు. ఇక ప్లాస్టిక్, కాటన్ వంటి మెటిరియల్తో తయారు చేసిన రాఖీలూ మనకు తెలుసు. కానీ..వెదురు బొంగులతో తయారు చేసిన రాఖీలను మీరెప్పుడైనా చూశారా..అవును వెదురు బొంగులతోనూ రాఖీలు చేయొచ్చు.
వెదురు బొంగులతో..
ప్రతీ ఏడాది ఆగస్టు రెండో వారంలో రాఖీ పౌర్ణమి పండగను మనం జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 11న రాఖీ పండగ ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని కొందరు మహిళలు వెదురు బొంగులతో రాఖీలు తయారు చేస్తున్నారు. గోరఖ్ పూర్ అటవీ శాఖ మహిళలతో రాఖీలను తయారు చేయిస్తోంది. రాఖీ పండగ కోసం లక్ష రాఖీలను తయారు చేయాలని నిర్ణయించింది. కాంపియర్‌గంజ్ పరిధిలోని లక్ష్మీపూర్‌లోని కామన్ ఫెసిలిటీ సెంటర్ లో మహిళా స్వయం సహాయక బృందం సభ్యులు ఈ రాఖీలు తయారు చేస్తున్నారు.
పండగ కోసం పర్యావరణ అనుకూల రాఖీలు..
సీఎం యోగి ఎల్లప్పుడు కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తారని..అందులో భాగంగానే..మొట్టమొదటి సారిగా వెదురు బొంగులతో రాఖీలు చేయాలన్న ఆలోచన వచ్చిందని గోరఖ్‌పూర్ డివిజనల్ అటవీ అధికారి వికాస్ యాదవ్ అన్నారు. పర్యావరణ అనుకూలమైన వెదురు రాఖీలను తయారు చేస్తే బాగుటుందని భావించినట్లు చెప్పారు. ఈ ఆలోచన మహిళల ఆదాయాన్ని పెంపొందించడంలో కూడా తోడ్పడుతుందని చెప్పారు. పండగ రోజున ప్రజలు కూడా పర్యావరణ అనుకూల రాఖీలు ధరిస్తారన్నాడు. ఈ ఆలోచనను మహిళా స్వయం సహాయక బృందాలకు తెలియజేసినప్పుడు వారు అంగీకరించారని..ఆ తర్వాత వారికి ముడిసరుకు అందించామని చెప్పారు.