మహిళలకు ఉపాధి కల్పిస్తున్న మాస్కులు

మహిళలకు ఉపాధి కల్పిస్తున్న మాస్కులు
  • ఇంట్లోనే మాస్కులు కుడుతూ సంపాదన
  • రోజుకు ఒక్కొక్కరు 200 మాస్కులు తయారీ

న్యూఢిల్లీ: రోజు రోజుకు విస్తరిస్తున్న కరోనాను అడ్డుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని, గాలి ద్వారా వ్యాపించకుండా అందరూ మాస్కులు పెట్టుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అంతే కాకుండా బయటకి వస్తే మాస్క్‌ కంపల్సరీ అని ఇప్పటికే చాలా ప్రభుత్వాలు ఉత్తర్వులు పాస్‌ చేశాయి కూడా. దీంతో మాస్కులకు మస్తు డిమాండ్‌ పెరిగిపోయింది. మాస్కులు కరోనా నుంచి కాపాడతమే కాకుండా చాలా మంది మహిళలకు ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి. రోజుకు దాదాపు 200 నుంచి 300 మాస్కులు కుట్టి లాక్‌డౌన్‌ కాలంలో కూడా డబ్బులకు ఇబ్బంది లేకుండా ఉపాధి పొందుతున్నామని మహిళలు అభిప్రాయపడుతున్నారు. కేరళలో.. రాష్ట్ర పేదరిక నిర్మూలన మిషన్‌ కుదుంబశ్రీ పథకం కింద మహిళలు నడుపుతున్న 300 కుటీర పరిశ్రమల్లోని మహిళలు ఇప్పటి వరకు 14.50 లక్షల క్లాత్‌ మాస్కులు కుట్టారని అధికారులు చెప్పారు. లేయర్‌‌ను బట్టి ఒక్కో మాస్కు ధరను రూ.10 నుంచి రూ.15 వరకు నిర్ణయించారన్నారు. లాక్‌డౌన్‌ వేళ మాస్కుల ద్వారా దాదాపు రూ.2కోట్ల టర్నోవర్‌‌ వచ్చిందన్నారు. “ నేను రోజుకు 200 మాస్కులు కుడతాను. ఇప్పటికి రూ.8వేలు సంపాదించాను. లాక్‌డౌన్‌ కాలంలో నేను మా కుటుంబానికి సాయం చేయగలుగుతున్నాను. మాస్కులు కేవలం కరోనా నుంచి జనాన్ని కాపాడతమే కాకుండా.. ఈ కష్టకాలంలో మాకు ఉపాధి కల్పించింది” అని కేరళకు చెందిన మాలా అనే మహిళ చెప్పారు. కేవలం కేరళలోనే కాకుండా బీహార్‌‌, మధ్యప్రదేశ్‌, అస్సాం, తదితర ప్రాంతాల్లో మహిళలు మాస్కులు తయారు చేయడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా మాస్కులు పంచేందకు కూడా బల్క్‌లో ఆర్డర్లు వస్తున్నాయని మాస్కుల తయారు చేసే వారు చెప్తున్నారు. కొంత మంది మాస్కులు తయారు చేసి వాటి ద్వారా వచ్చే డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు.