మహిళలకు ధాన్యలక్ష్మి..వానాకాలం సీజన్లో వడ్లు కొనుగోలు చేసిన మహిళా సంఘాలు

మహిళలకు ధాన్యలక్ష్మి..వానాకాలం సీజన్లో వడ్లు కొనుగోలు చేసిన మహిళా సంఘాలు
  • వానాకాలం సీజన్​లో వడ్లు కొనుగోలు చేసిన మహిళా సంఘాలు
  • జిల్లావ్యాప్తంగా 1,53,638 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
  • కమీషన్​గా రూ.4 కోట్ల 92 లక్షల ఆదాయం
  • త్వరలో మహిళల అకౌంట్లలో జమ : డీపీఎం సురేశ్

​కామారెడ్డి, వెలుగు : మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ చేయూతనందిస్తోంది.  సంక్షేమ పథకాలతోపాటు ఆదాయం సమకూరే పలు పనులను అప్పజెప్పుతూ అండగా నిలుస్తోంది. దీంతో  ఆర్థికంగా నిలదొక్కుకోవడంతోపాటు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తూ కమీషన్ కేటాయిస్తోంది.

మహిళలు సక్సెస్​ఫుల్​గా వానాకాలం కొనుగోళ్లు పూర్తి చేయడంతో గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలకు ఆర్థికంగా లబ్ధి చేకూరింది. కామారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్​కు సంబంధించి వడ్ల కొనుగోళ్లలో 179 గ్రామ మహిళా సంఘాలకు కమీషన్​ రూపంలో రూ.4 కోట్ల 92 లక్షల ఆదాయం సమకూరింది.  

1,53,638 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు..

జిల్లాలో వానాకాలం సీజన్​లో 4,50,660 మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.1,089 కోట్లు ఉంటుంది. ఇందులో మహిళా సమాఖ్యలు 35,002 మంది రైతుల నుంచి 1,53,638 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశాయి. 

వీటి విలువ రూ.367 కోట్లు ఉంటుంది. 34 శాతం వరి ధాన్యాన్ని మహిళా సంఘాలు కొనుగోలు చేశాయి.  వానాకాలం సీజన్​లో జిల్లావ్యాప్తంగా 427 సెంటర్లను ప్రారంభించగా, మహిళా సంఘాలకు 179 సెంటర్లను ప్రభుత్వం కేటాయించింది. వడ్ల కొనుగోళ్లలో గ్రామ సమాఖ్యలకు మండల, జిల్లా సమాఖ్య ప్రతినిధులు అండగా నిలిచారు. ఐకేపీ అధికారులు నిరంతరం 
పర్యవేక్షించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీఆర్డీవో సురేందర్, డీపీఎం సురేశ్ పలుమార్లు కొనుగోలు సెంటర్లను పరిశీలించారు.   

రూ.4 కోట్ల 92 లక్షల ఆదాయం.. 

మహిళా సంఘాలకు కేటాయించిన సెంటర్లలో వరి ధాన్యం కొనుగోలు చేయగా కమీషన్​రూపంలో రూ.4 కోట్ల 92 లక్షల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం క్వింటాల్​కు రూ.30 ల చొప్పున చెల్లిస్తోంది. వచ్చిన ఆదాయంలో 40 శాతం సెంటర్ల నిర్వహణ, వసతులు,  సిబ్బంది వేతనం వంటి వాటికి కేటాయిస్తారు. మిగిలిన 60 శాతంలో 4 శాతం మండల సమాఖ్యకు, 5 శాతం జిల్లా సమాఖ్యకు కేటాయించగా, 51 శాతం గ్రామ సమాఖ్యలకు మిగులుతోంది.

జిల్లావ్యాప్తంగా 1,53,638 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయగా, కమీషన్ రూపంలో రూ.4 కోట్ల 92 లక్షల ఆదాయం వచ్చింది. సుమారు రూ. 2 కోట్ల మేర ఖర్చులు పోనున్నాయి. మండల, జిల్లా సమాఖ్యకు రూ.45 లక్షల వరకు పోతుంది. ఇంకా రూ.2.కోట్ల 47 లక్షల వరకు గ్రామ సమాఖ్యలకు లబ్ధి చేకూరనున్నది. 

త్వరలో డబ్బులు జమ చేస్తాం 

వడ్ల కొనుగోళ్లలో మహిళా సంఘాలు సక్సెస్​అయ్యాయి. క్వింటాల్​కు రూ.30 చొప్పున కమీషన్ చెల్లిస్తాం. వచ్చిన ఆదాయాన్ని స్ర్తీనిధిలో జమ చేయనుండగా తిరిగి సమాఖ్యలు, సభ్యులకు రుణాల రూపంలో అందనున్నాయి. వడ్ల కమీషన్​తో మహిళలు ఆర్థికంగా మరింత బలపడనున్నారు. కమీషన్​గా రావాల్సిన సొమ్మును త్వరలోనే మహిళా సంఘాల అకౌంట్లలో జమ చేస్తాం.  
- సురేశ్, డీపీఎం