మరిన్ని ఎస్హెచ్జీలు.. జిల్లాలో కొత్తగా 11,119 మంది సభ్యుల గుర్తింపు

మరిన్ని ఎస్హెచ్జీలు..  జిల్లాలో కొత్తగా 11,119 మంది సభ్యుల గుర్తింపు
  • పల్లెలు, పట్టణాల్లో పెరగనున్న స్వయం సహాయక సంఘాలు
  • మహిళలకు ఆర్థిక చేయూతనందిస్తున్న రాష్ట్ర సర్కార్

కామారెడ్డి, వెలుగు : మహిళా స్వయం సహాయక సంఘాలకు మరింత బలం వచ్చింది. ఇప్పటివరకు సంఘాల్లో సభ్యులుగా లేనివారిని గుర్తించి సంఘాల్లో చేర్పించడం, కొత్త సంఘాలు ఏర్పాటు చేయడం ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐకేపీ, మేప్మా అధికారులు కామారెడ్డి జిల్లాలో 11,119 మంది కొత్త సభ్యులను గుర్తించారు. వీరిలో కొందరిని ఇప్పటికే ఉన్న సంఘాల్లో చేర్చనుండగా, మిగతా వారితో కొత్త సంఘాలు ఏర్పాటు చేయిస్తున్నారు. పొదుపు, ఉపాధి అవకాశాలు, బ్యాంక్ అకౌంట్లు తీయడం వంటి అంశాలపై కొత్తవారికి అవగాహన కల్పిస్తున్నారు. అదనంగా వృద్ధులు, దివ్యాంగులతో కూడిన సంఘాల ఏర్పాటుకూ సభ్యులను గుర్తించారు. 

బ్యాంక్ అకౌంట్లు తీయించటం, పొదుపును అలవర్చటం వంటి ప్రక్రియపై ఫోకస్ పెట్టారు.   ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ ద్వారా మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సుల కొనుగోలు, పెట్రోల్ బంకుల ఏర్పాటు వంటి కార్యక్రమాలను మహిళా సంఘాలకే అప్పగిస్తోంది.  ఇందులో భాగంగా సంఘాల్లో లేని వారిని గుర్తించి సంఘాలను ఏర్పాటు చేయాలని  ప్రభుత్వం ఆదేశించింది.  

గ్రామీణ ప్రాంతాల్లో..

గ్రామీణ ప్రాంతాల్లో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 8,709 మంది మహిళలను కొత్తగా గుర్తించారు. వీరిలో 3,270 మందిని ఇప్పటికే ఉన్న సంఘాల్లో చేర్పించనున్నారు. ఒక్కో సంఘంలో 10 మంది ఉండాల్సి ఉండగా, కొన్ని చోట్ల 8 లే దా 9 మందితో కూడా సంఘం ఏర్పాటు చేశారు. ఆ సంఘాల్లో వీరిని చేర్పిస్తారు.  మిగిలిన 5,339 మందితో 533 కొత్త సంఘాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 17,203 సంఘాలు ఉండగా, 1,79,417 మంది సభ్యులు ఉన్నారు.

పట్టణ ప్రాంతాల్లో..

జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పరిధిలో 2,410 కొత్త సభ్యులను గుర్తించారు. వీరిలో కామారెడ్డిలో 1,970 మంది, బాన్సువాడలో 290 మంది, ఎల్లారెడ్డిలో 150 మంది ఉన్నారు. ఇప్పటికే 1,570 మంది సభ్యులతో157 సంఘాలు ఏర్పడగా, మరికొన్ని రోజుల్లో 840 మంది సభ్యులతో 84 సంఘాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం ఈ మూడు పట్టణాల్లో 2,652 సంఘాలు ఉండగా, 26,520 మంది సభ్యులు ఉన్నారు. బిచ్‌కుంద మున్సిపాలిటీగా ఏర్పడినా, అక్కడి సంఘాలు ఇంకా మెప్మా పరిధిలోకి రాలేదు.

ఆరు నెలల తర్వాత లోన్లు.. 

కొత్తగా ఏర్పడిన సంఘాలకు ముందుగా బ్యాంక్ అకౌంట్లు తెరిచి, సభ్యులతో నెలనెలా పొదుపు చేయిస్తారు. ఆరు నెలల తర్వాత ఈ సంఘాల కార్యకలాపాలను సమీక్షించి, వారికి బ్యాంకు లోన్లు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

దివ్యాంగులు, వృద్ధుల గుర్తింపు..

జిల్లాలో 1,485 మంది దివ్యాంగులు, 3,770 మంది వృద్ధులను కొత్తగా గుర్తించారు. వీరితో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. వీరికి లోన్లు ఇప్పించి ప్రభుత్వం చేయూతనందించనున్నది.