62 సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే ఎక్కువ

62 సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే ఎక్కువ
  • హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పురుష ఓటర్లు ఎక్కువ
  • మహిళలను ఆకట్టుకునేందుకు పార్టీల వ్యూహాలు

హైదరాబాద్, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలకం కానున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో సగానికి పైగా స్థానాల్లో మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. ఇంట్లో ఓట్లను కూడా మహిళలు ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో.. గెలుపు, ఓటములు నిర్ణయించేది మహిళలే అనే చర్చ సాగుతున్నది. ఇటీవల ఎలక్షన్ కమిషన్ రిలీజ్​చేసిన ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 1.52 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లోని నియోజకవర్గాలతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోనే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

రూరల్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్యనే అధికంగా ఉన్నది. నాగర్ కర్నూల్, కుంమ్రం భీమ్​ ఆసిఫాబాద్, మంచిర్యాల, యదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క నియోజకవర్గంలోనూ పురుష ఓటర్లే ఎక్కువున్నరు. నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జిల్లాల్లో మహిళ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను తీసుకున్న రాజకీయ పార్టీలు, పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు మహిళలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఎవరి లెక్కలు వారివే

అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు మహిళలను ఆకట్టుకునేందుకు పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మితో ప్రతి మహిళకు రూ.2500 ఆర్థిక సాయం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటివి అమలు చేస్తామని ప్రకటించింది. అధికార బీఆర్ఎస్ కూడా కల్యాణలక్ష్మి, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు అమలు చేస్తున్న పథకాలను ప్రచారం చేసుకుంటున్నది. బీజేపీ కూడా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఎన్నికల మేనిఫెస్టో రెడీ చేసినట్లు తెలిసింది.

కుత్బుల్లాపూర్​లో 3 లక్షల పైనే

రాష్ట్రంలోని ఒక నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య 3 లక్షలు దాటింది. కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలో 3.03 లక్షల మంది మహిళ ఓటర్లు ఉన్నారు.  ఎల్బీ నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, మేడ్చల్, మల్కాజ్​గిరి, కూకట్​పల్లి, ఉప్పల్​లో వీరి సంఖ్య 2 లక్షలు దాటింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 30 నియోజకవర్గాల్లో లక్షలోపు మహిళ ఓటర్లు ఉంటే ఈసారి ఆ సంఖ్య 9కి చేరింది. చెన్నూర్​, బెల్లంపల్లి, బాన్సువాడ, జుక్కల్, దుబ్బాక, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా నియోజకవర్గాల్లోనే లక్ష లోపు మహిళ ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎక్కువగా 
రిజర్వ్​డ్​, వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి.