అత్యాచారం, హత్య ఘటనపై భగ్గుమన్న మహిళా సంఘాలు

అత్యాచారం, హత్య ఘటనపై  భగ్గుమన్న మహిళా సంఘాలు

నల్గొండ జిల్లా: రాష్ట్రంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. గంజాయి మత్తులో సైదాబాద్ చిన్నారిపై హత్యాచారం ఘటన మరువక ముందే....నల్గొండ జిల్లాలో మద్యం మత్తులో మరో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న మహిళను ఇంట్లో కి లాకెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత ఆమె తలను నేలకు, గోడకేసి కొట్టి దారుణంగా చంపేశారు. ఆధారాలు దొరక్కుండా రక్తపు మరకలు కడిగేశారు. డెడ్ బాడీని బయట రేకుల షెడ్ కింద పడేశారు. నల్లొండ జిల్లా ముషంపల్లిలో ఈ ఘటన జరిగింది. 

ముషంపల్లికి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇంటికి కొద్ది దూరంలో వీళ్లు కిరాణాషాపు నడిపిస్తున్నారు. షాప్ కు వెళ్తున్న టైంలో అదే గ్రామానికి  చెందిన బక్క తొట్ల లింగయ్య, ఏర్పుజర్ల పుల్లయ్య మహిళను ఇంట్లోకి లాక్కెళ్లారు. అత్యాచారం చేసి చంపేశారు. శవాన్ని రోడ్డుపై పడేసిన నిందితులే వెళ్లి మహిళ అక్కడ పడిపోయి ఉందని డ్రామా ఆడారు. స్పాట్ కు వచ్చిన పోలీసులు అనుమానంతో నిందితుల ఇళ్లను సోదా చేశారు. ఇంట్లో రక్తపు మరకలు గుర్తించి మద్యం మత్తులో అఘాయిత్యం చేసినట్లు గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత మహిళ డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు. నిందితులను చితకబాది పోలీసులకు అప్పజెప్పారు గ్రామస్థులు.

నిందితులు లింగయ్య, పుల్లయ్యల ఇద్దరిది నేర చరిత్రే. పుల్లయ్య మొదటి భార్య విడాకులు ఇవ్వడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యను, ఏడాది వయసున్న పాపను చంపేశాడు. మరోవైపు ఇతర మహిళలతో లింగయ్య అసభ్యంగా ప్రవర్తించడంతో.....అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వారం కిందటే గ్రామంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు లింగయ్య. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పలు పార్టీల నేతలు నిరసన తెలిపారు. 

ముషంపల్లిలో మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై మహిళా సంఘాలు, ఆర్య వైశ్య సంఘం భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నల్గొండలో భారీ ర్యాలీ తీశాయి. క్లాక్ టవర్ దగ్గర భారీ మానవ హారం నిర్వహించాయి. తిప్పర్తిలో నిరసనలు చేపట్టారు. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వమే కారణమన్నారు మహిళా సంఘాల నేతలు. గ్రామాల్లో బెల్ట్ షాపులను కంట్రోల్ చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు లంచాల మత్తులో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని ఎస్పీ రంగనాథ్ కు వినతి పత్రం సమర్పించారు.