కాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం: మంత్రి వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • వాళ్లను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం: మంత్రి వివేక్
  • గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని ఫైర్
  • మహిళల ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్నం: మంత్రి దామోదర 
  • సంగారెడ్డిలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు
  • వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు

సంగారెడ్డి, వెలుగు: మహిళా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వాళ్లను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నదని కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఇందులో భాగంగానే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫస్ట్​ పెట్రోల్ పంపు సంగారెడ్డిలోనే ఏర్పాటు చేశామన్నారు. 

 బుధవారం సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ మంత్రి అయిన వివేక్ వెంకటస్వామి.. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి వివేక్ మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు మహిళలను మోసం చేసిందని మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో డబుల్​బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి, మాయమాటలతో కాలం వెళ్లదీశారు. ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. బీఆర్ఎస్​పదేండ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. 

కానీ మేం ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 13 వేల పైచిలుకు రేషన్ కార్డులు మంజూరు చేశాం. బీఆర్ఎస్​విధానాల వల్ల రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఇప్పటికే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఫ్రీ బస్, సన్న బియ్యం పంపిణీ తదితర హామీలు అమలు చేశాం” అని చెప్పారు.  

మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ: దామోదర 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచే మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ కృషి చేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.   ‘‘మహిళల సంక్షేమం కోసం మా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు వ్యవసాయంలో ఉపయోగించే డ్రోన్ల పంపిణీ, డ్రైవింగ్ శిక్షణ లాంటి కార్యక్రమాలు చేపట్టాం” అని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫయిమ్, టీజీఐఐసీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్​పంకజ్ తదితరులు పాల్గొన్నారు.