కాగజ్ నగర్,వెలుగు: వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో మళ్లీ పోడు భూముల లొల్లి మొదలైంది. గతంలో పెంచికల్ పేట మండలం కొండపల్లి సమీపంలోని పోడు భూమిలో ఫారెస్ట్ ఆఫీసర్లు మొక్కలు నాటేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న రైతులు శుక్రవారం నాగళ్లతో భూమివద్దకు చేరుకున్నారు. వారికి సర్పంచులు, టీఆర్ఎస్లీడర్లు మద్దతు పలికారు. బెజ్జూర్ రేంజ్ఆఫీసర్ దయాకర్, రూరల్ సీఐ నాగరాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు, పోడు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది.
తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా..
ఫారెస్ట్ఆఫీసర్ల తీరును నిరసిస్తూ పెద్ద సిద్ధాపూర్, చిన్న సిద్ధాపూర్, ఎల్క పల్లి (బి) రైతులు బెజ్జూర్ తహసీల్దార్ఆఫీస్ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పోడు వ్యవసాయం నుంచి తమను దూరం చేసేందుకే ఫారెస్ట్ఆఫీసర్లు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏండ్లుగా సాగుచేసుకున్న భూములను ఫారెస్ట్ఆఫీసర్లు ఎట్ల స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సకారం, ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా మాట్లాడుతూ అన్యాయంగా రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. నిరసనలో మండల కోఆప్షన్ సభ్యుడు బాషరత్ ఖాన్, పెద్ద సిద్దాపూర్ సర్పంచ్ రవి, ఉప సర్పంచ్ ఠాక్రే శ్రీనివాస, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్, లీడర్లు జావిద్, సీహెచ్ దేవాజీ, జాహెద్ హుస్సేన్, తంగడపల్లి మహేశ్తదితరులు
పాల్గొన్నారు.
