
- హన్మకొండ, రంగారెడ్డి మున్సిపాలిటీల్లో స్టార్ట్
- 50 వేల మందికి మంజూరు పత్రాలు ఇచ్చినఅధికారులు
- ఒక్కో ఇంటికి కేంద్రం నుంచి రూ.లక్షన్నర సాయం
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో శరవేగంగా అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ఇప్పుడు అర్బన్ ఏరియాల్లో కూడా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సొంత జాగా ఉన్న 50 వేల మంది లబ్ధిదారులకు హౌసింగ్ అధికారులు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. దీంతో బేస్ మెంట్లు నిర్మించే పనులు జరుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ, తుర్కయాంజల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఇళ్ల పనులు షురూ అయ్యాయి. మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా సొంత జాగా ఉన్న లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ల మంజూరు పత్రాలు అందిస్తున్నారు.
అర్బన్ లో లక్షపైనే ఇండ్లను సాంక్షన్ చేసిన కేంద్రం
తెలంగాణ కు రూరల్ లో 3 లక్షలు, అర్బన్ లో 6 లక్షల ఇండ్లను పీఎం ఆవాస్ స్కీమ్ కింద మంజూరు చేయాలని అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. అలాగే హౌసింగ్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినపుడు కూడా ఇండ్ల మంజూరు కోసం వినతిపత్రాలు సమర్పించారు.
ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని కొద్ది నెలల క్రితం అర్బన్ ఏరియాల్లో 1.13 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. అర్బన్ ఏరియాల్లో ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు సాయం అందజేస్తున్నది. మిగతా 3.50 లక్షలు రాష్ర్ట ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
టవర్లపై త్వరలో నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ఏరియాల్లో లక్షల సంఖ్యలో అప్లికేషన్లు రాగా సొంత జాగా ఉన్న లబ్ధిదారులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక్క జీహెచ్ఎంసీలోనే ఇందిరమ్మ ఇంటి కోసం 10.75 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకోగా ఇందులో సొంత జాగా ఉన్న వాళ్లు లక్షలోపే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వ జాగాల్లో జీ ప్లస్ 3 ఫ్లోర్లలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో జీహెచ్ఎంసీలో 19 స్థలాలను గుర్తించారు.