వర్కర్... ఓనర్ అయ్యేదెప్పుడు..?

వర్కర్... ఓనర్ అయ్యేదెప్పుడు..?
  • ముందుకు సాగని వర్కర్​ టు ఓనర్​ స్కీం
  • మూడేళ్లుగా కొనసాగుతున్న గ్రూప్ ​వర్క్​ షెడ్లు
  • నత్తనడకన రూ.392 కోట్ల పనులు 
  • వచ్చే ఏడాదికీ పూర్తవ్వడం కష్టమే..

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నేత కార్మికులను ఆసాములుగా చేసేందుకు సర్కారు వర్కర్​ టు ఓనర్​ స్కీం తీసుకొచ్చింది. కార్మికుడిని యజమానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వమే గ్రూప్ ​వర్క్​షెడ్లు నిర్మించి, బ్యాంకు రుణాలతో ఆధునిక యంత్రాలను అందించాలనేది ప్లాన్. అయితే కాంట్రాక్టర్​ నిర్లక్ష్యంతో సిరిసిల్ల గ్రూప్ ​వర్క్​షెడ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లలో గ్రూపు వర్క్​షెడ్ల నిర్మాణం పూర్తి చేసి ఇస్తామన్న నిర్మాణ సంస్థ మూడేళ్లయినా పనులు పూర్తి చేయలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలోని పెద్దూర్​ బైపాస్​ రోడ్డులో వర్కర్ ​టు ఓనర్​స్కీంలో భాగంగా గ్రూపు వర్క్​షెడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం 2017లో 88 ఎకరాల ప్రభుత్వ భూసాగర్​లో మిని కేటాయించింది. ఈ స్థలంలో రూ.392 కోట్లతో 46 వీవింగ్​ యూనిట్లు, 4 వార్పిన్​ యూనిట్ల నిర్మాణం చేయాల్సి ఉంది. ఒక్కో యూనిట్లో 24 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 4 లూమ్స్​​ చొప్పున 96 లూమ్స్​ను ప్రభుత్వమే బ్యాంకు ష్యూరిటీ తో ఇప్పించేందుకు ప్రణాళికలు తయారు చేశారు. మొదటి విడతలో 1,104 మంది వర్కర్లను ఓనర్లుగా మార్చేందుకు చర్చలు చేపట్టారు. గ్రూప్​వర్క్ ​షెడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రైవేట్​సంస్థకు అప్పగించింది. రెండేళ్లలో పూర్తి చేస్తామంటూ 2018 ఏప్రిల్​లో పనులు ప్రారంభించారు. 2020 మేలో పనులు పూర్తవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు కాలేదు. నిర్మాణ గడువు దాటి ఏడాది గడుస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒక్క మోడల్ ​షెడ్డు మాత్రమే పూర్తయ్యింది. మిగతా గ్రూపు షెడ్ల పనులు కొనసాగుతున్నాయి. మరో ఏడాదైనా పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. గ్రూపు వర్క్​షెడ్లు ఎప్పుడు పూర్తవుతాయి.. తమకు ఎప్పుడు కేటాయిస్తారోనంటూ కార్మికులు మూడేండ్లుగా ఎదురు చూస్తున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. 

పనులు వేగవంతం చేశాం

గ్రూప్ వర్క్ షెడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేశాం. కరోనాతో పనులు ఆలస్యమైనట్లు నిర్మాణ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. మరో 10 నెలల లోపు పనులు పూర్తవుతాయి. గ్రూప్ షెడ్లు నాణ్యతతో నిర్మిస్తున్నాం. కార్మికులకు లూంప్ ఎలా ఏర్పాటు చేయాలి, బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పించడం వంటి అంశాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. వీలైనంత త్వరగా గ్రూప్ వర్క్ షెడ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. -తస్లీమ్, డిప్యూటీ డైరెక్టర్, చేనేత జౌళి శాఖ.