విశాల్ ప్యాకేజింగ్ కంపెనీ ఎదుట కార్మికుల ఆందోళన

విశాల్ ప్యాకేజింగ్ కంపెనీ  ఎదుట కార్మికుల ఆందోళన

శంషాబాద్, వెలుగు: కాటేదాన్​లోని విశాల్‌ ప్యాకేజింగ్ కంపెనీలో 30 ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికులను మేనేజ్​మెంట్ తొలగించడం సరికాదని మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ సెక్రటరీ వనంపల్లి జైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కంపెనీ ముందు ఆందోళన చేస్తున్న కార్మికులకు వారు మద్దతు తెలిపారు. అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికులను అకారణంగా ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా తొలగించడం దారుణమన్నారు.

కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. లేదా వారికి  వర్క్ మెన్ కాంపోజిషన్ కింద గ్రాడ్యువిటీ చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ జీతాలు ఇచ్చామని.. పీఎఫ్ కూడా మరికొద్ది రోజుల్లో అందజేస్తామని విశాల్ ప్యాకేజింగ్  మేనేజ్​మెంట్ పేర్కొంది. తమ కంపెనీలో పనిచేసే కార్మికులకు అన్యాయం జరగకుండా చూస్తామని తెలిపింది. కంపెనీ నష్టాల్లో నడుస్తున్నందునే మూసివేశామని  స్పష్టం చేసింది. ఆందోళనలో  కార్మికులు  సురేష్, బన్నయ్య, బాలరాజ్ పాల్గొన్నారు.