
కార్మికులను ఎట్టిపరిస్థితుల్లోనూ విధుల్లోకి తీసుకునే ప్రసక్తేలేదని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. లేబర్ కమిషనర్ నిర్ణయం వచ్చేంతవరకు వేచి చూడాలని తెలిపింది. ఆర్టీసీ జేఏసీ భేషరతుగా కార్మికులు విధుల్లోకి హాజరుకావాలని ప్రకటన చేయడంతో స్పందించారు ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ.
జేఏసీ నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని..ఇష్టం వచ్చినప్పుడు విధుల్లోకి వస్తారా అని తెలిపారు. పండుగ సమయాల్లో అనాలోచిత సమ్మె చేశారని ఆర్టీసీ కార్మికుల నిర్ణయాన్ని సునీల్ శర్మ తప్పుపట్టారు. సమ్మె వలన ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదన్నారు. ఆర్టీసీ గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదన్నారు. కార్మికులు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారని అన్నారు. దీనిపై కార్మికశాఖ కమిషనర్ సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునే వరకు అందరూ సంయమనం పాటించాలని సూచించారు. తాత్కాలిక కార్మికులను అడ్డుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని డిపోల దగ్గర పోలీసు భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డిపోల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తామని చెప్పారుఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ.