అరకొర జీతాలతో గ్రామ పంచాయతీ కార్మికుల గోస

అరకొర జీతాలతో గ్రామ పంచాయతీ కార్మికుల గోస
  • అరకొర జీతాలతో గ్రామ పంచాయతీ కార్మికుల గోస
  • 36,500  మంది కార్మికులు, జీతం రూ.8 వేలు 
  • మూడుసార్లు మున్సిపల్ కార్మికుల జీతాలు పెరిగినయ్ 
  • కొత్త జీపీల్లో 7,500 కార్మికుల ఖాళీలు

హైదరాబాద్, వెలుగు : రాష్టవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు జీతాలు పెంచాలని ఎంతో కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సర్కారు మాత్రం వీరిని పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ల కార్మికుల జీతాలు 2014 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు పెంచి మాకెందుకు పెంచడం లేదని గ్రామ పంచాయతీ కార్మికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్​ కార్మికులకు 2015 నుంచి రూ.9,649, 2017 నుంచి రూ.13,950, 2022లో రూ.18,057 చొప్పున జీతాలు పెరిగాయి. రాష్ర్టంలో 12,761 గ్రామ పంచాయతీలు ఉండగా సుమారు 36,500 మంది కార్మికులు రూ.8 వేల జీతానికి పని చేస్తున్నారు. 
 

90 శాతం మంది బడుగు బలహీన వర్గాలే

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న  కార్మికుల్లో 90 శాతం మంది బీసీ, ఎస్సీ వర్గాల వారే. ఎన్నో ఏళ్ల నుంచి గ్రామాల్లో నీటి సరఫరా, డ్రైనేజీల క్లీనింగ్ తో పాటు అన్ని పనులు చేస్తున్నారు. పల్లె ప్రగతిలో కార్మికులు అద్భుతంగా పనిచేశారని మంత్రులు, సీఎం పొగిడారు తప్ప జీతాలు మాత్రం పెంచలేదంటున్నారు. గతేడాది నుంచి స్కూళ్ల క్లీనింగ్ బాధ్యతను కూడా జీపీ కార్మికులకే ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.8 వేలతో ఎలా బతకాలని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఊర్లలో రోజు కూలికి పోతేనే రూ.500 ఇస్తున్నారని, ప్రభుత్వం మాత్రం మా జీతాలు పెంచటం లేదని ఖమ్మం జిల్లాకు చెందిన వెంకన్న అనే కార్మికుడు వాపోయారు. గతేడాది సీఆర్.బిశ్వాల్ ఆధ్వర్యంలో పీఆర్సీ కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. రాష్ర్టంలో కనీస వేతనం రూ.19 వేలు ఉండాలని రిపోర్ట్ లో తెలిపింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. 

కార్మికుల డిమాండ్లు...


గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కార్మికులకు జీతాలు పెంచినట్లు మాకూ పెంచాలె.
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేయాలె.
జాబ్ సెక్యూరిటీ కల్పించి, హెల్త్ కార్డు ఇయ్యాలె. 
కారోబార్లకు, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలె.
పనిచేస్తున్న కార్మికులందరికి వేతనాలు ఇచ్చి, కేటగిరీల వారీగా జీతాలు పెంచాలె.

7 వేలకు పైగా ఖాళీలు
రాష్ట్రంలో 500 జనాభా దాటిన తండాలను, పెద్ద జీపీలను విభజించి సుమారు 4,500 కొత్త గ్రామ పంచాయతీలను 2018 లో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కార్మికులను మాత్రం కొత్తగా నియమించలేదు. 2011 జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం కార్మికులు పని చేస్తున్నారు. కొత్త జీపీలతో పాటు, పాత జీపీల్లో ఖాళీలు సుమారు 7,500 ఉన్నాయని.. వాటిని ఫిల్ చేయడంతో పాటు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

జీతాలు పెంచాలె
గ్రామ పంచాయతీ కార్మికుల్లో 90 శాతం మంది బడుగు, బలహీనవర్గాల వారే. రూ.8 వేల జీతం ఇచ్చి ఎన్నో పనులు చేపిస్తున్నరు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు రూ.22,750 జీతం ఇస్తుండ్రు. జీపీ కార్మికులకు కనీసం రూ.15,600 అయినా ఇయ్యాలని కోరుతున్నం. ప్రభుత్వం పట్టించుకుంటలే. త్వరలోనే రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు చేస్తం.
                                                                                                                                                                                                                            - పాలడుగు భాస్కర్, గౌరవాధ్యక్షుడు, జీపీ కార్మికుల యూనియన్ 

 అందరికి పెంచిండ్రు 
సర్కారు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చింది. జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం జీతాలుపెంచింది. గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రం పెంచలే. కార్మికులపై పని భారం తగ్గించి, జీతాలు పెంచి, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నం. 
                                                                                                                                                                                                - గణపతి రెడ్డి, స్టేట్ ప్రెసిడెంట్, జీపీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్

రాష్ట్రమొచ్చినా పెరగలే
తెలంగాణ వచ్చినా జీపీ కార్మికుల జీతాలు పెరగలే. 2014, 2021 పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచాలె. 2014లో రూ.8,300 జీతం ఉండేది. 2015లో 42 రోజులు సమ్మె చేస్తే పెంచుతమని మంత్రి కేటీఆర్ సమ్మెని విరమింపజేసిండు. కనీసం రూ.19 వేలు ఇయ్యాలని పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసింది. ఇప్పటి వరకు సర్కార్ నుంచి ఉలుకు పలుకు లేదు.
                                                                                                                                                                                                 - రాజమల్లు, జనరల్ సెక్రటరీ, కరీంనగర్ జీపీ కార్మికుల యూనియన్