పనికి తగ్గ జీతం ఇయ్యాలె..కేటీపీఎస్ ఎదుట కార్మికుల ఆందోళన

పనికి తగ్గ జీతం ఇయ్యాలె..కేటీపీఎస్ ఎదుట కార్మికుల ఆందోళన

పాల్వంచ, వెలుగు: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్‌‌‌‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికులు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) ఎదుట ఆందోళన చేపట్టారు. వేలాది మంది కార్మికులు స్థానిక అంబేద్కర్ సెంటర్‌‌‌‌లో సుమారు ఏడు గంటల పాటు బైఠాయించి నిరసన తెలిపారు. 

విద్యుత్ సంస్థలలోని పలు కార్మిక సంఘాలు మద్దతు తెలపడంతో 9 కార్మిక సంఘాలతో ఏర్పడిన ఐక్య ఆర్టిజన్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది. కార్మిక సంఘాలకు సీపీఐ, సీపీఎం, బీజేపీ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఈ నెల 7న వరంగల్‌‌‌‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన అనంతరం సమ్మెకు దిగుతారని నాయకులు హెచ్చరించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేశ్​హాజరై కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు కేటీపీఎస్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన కార్మికులను యాజమాన్యం గేటు వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం యాజమాన్యం అనుమతి ఇవ్వడంతో కార్మికులు విధుల్లో చేరారు.  ఈ కార్యక్రమంలో సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ చెరకు భాగ్యలక్ష్మి, న్యూడెమోక్రసీ నాయకుడు గౌని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.