కార్మికులే సమ్మె విరమించాలి : మెట్టు దిగమన్న కేసీఆర్

కార్మికులే సమ్మె విరమించాలి : మెట్టు దిగమన్న కేసీఆర్

ప్రజలకు ఏ ఇబ్బందీ లేదు: కేసీఆర్
90 శాతం బస్సులు నడుస్తున్నయి
మెజారిటీ కార్మికులకు సమ్మె ఇష్టం లేదు
నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంది
కోర్టులో బలంగా వాదనలు వినిపించాలి
అధికారులకు సీఎం ఆదేశం

పూర్తిస్థాయి ఎండీ ముచ్చటేలేదు!

ఆర్టీసీకి ప్రస్తుతం పూర్తిస్థాయి ఎండీ అవసరం లేదనే అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ సెక్రటరీ సునీల్ శర్మ ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా కూడా వ్యవహరిస్తున్నారని, దీంతో విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉండదని ఉన్నతాధికారులు అంటున్నారు. ఇదే విషయాన్ని కోర్టుకు వివరిస్తామని చెప్తున్నారు. ఎండీ, సెక్రటరీ వేర్వేరుగా ఉంటే విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో జాప్యం ఉంటుందని అంటున్నారు.

హైదరాబాద్, వెలుగు: సమ్మె విషయంలో మెట్టు దిగేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. కార్మికులు వాళ్లకు వాళ్లే సమ్మె విరమించాలని, అప్పుడే చర్చలు జరపాలని ఆయన అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఆర్టీసీ సమ్మె పరిణామాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై గురువారం క్యాంపు ఆఫీసులో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఆయన హుజూర్​నగర్​ ఎన్నికల ప్రచార సభకు వెళ్లాల్సి ఉండగా అది రద్దవడంతో సమ్మెపై సమీక్ష చేపట్టారు. మంత్రి పువ్వాడ అజయ్, రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. సమీక్షలో సీఎం ప్రస్తావించిన అంశాలు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. సమ్మె విషయంలో శుక్రవారం హైకోర్టులో ప్రభుత్వం తరఫున గట్టిగా వాదనలు వినిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగలేదని, 90 శాతం బస్సులను తిప్పుతున్నామని, ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తేవాలని వారికి సూచించారు. పల్లె ప్రాంతాల్లోనూ మెజార్టీ బస్సులను తిప్పడంలో సక్సెస్ అయ్యామని అన్నారు.

కార్మికులపైనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని సీఎం పేర్కొన్నారు. మెజారిటీ కార్మికులకు సమ్మె చేయడం ఇష్టం లేదని, దీనిపై ఇంటెలిజెన్స్​ రిపోర్టు తన వద్ద ఉందని ఆయన అన్నారు. నిఘా వర్గాలు సేకరించిన నివేదికల్లో కార్మికులు యూనియన్ నేతలపై గుర్రుగా ఉన్నారని తెలిపారు. ఆర్టీసీలో సంస్కరణలు తప్పవని స్పష్టం చేశారు. ఆర్టీసీలో ప్రైవేటు బస్సులు 20 శాతం, అద్దె బస్సుల 30 శాతం, ఆర్టీసీ బస్సులు 50 శాతం  ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై సీఎం సీరియస్ గా ఉన్నారని ఓ సీనియర్ అధికారి చెప్పారు.

సమీక్షలో కేకే

హుజూర్​నగర్​ ఎన్నికల ప్రచార సభకు తనతో రావాలని ఎంపీ కె.కేశవరావు, మంత్రి మహమూద్​ అలీని సీఎం కోరడంతో వారు ప్రగతిభవన్​కు వచ్చారు. అయితే.. సభ రద్దు కావడంతో మహమూద్​ అలీ కాసేపు అక్కడే ఉండి వెళ్లిపోయారు. కేకే మాత్రం మూడు గంటలపాటు ఉన్నారు. సమ్మెపై కేసీఆర్​నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు.