బాలికలకు హక్కులు, భద్రత ఇవ్వాలి : సురభి భారతి

బాలికలకు హక్కులు, భద్రత ఇవ్వాలి :  సురభి భారతి
  • కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో పథకంపై వర్క్ షాప్ 

సికింద్రాబాద్​, వెలుగు: కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే ‘ బేటీ బచావో బేటీ పడావో’ స్కీమ్ పై ఇఫ్లూ ( ద ఇంగ్లీష్ ​అండ్​ ఫారిన్​ లాంగ్వేజెస్​ యూనివర్సిటీ )లో గురువారం వర్క్​షాపు జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇఫ్లూ ఇన్ చార్జ్ వీసీ ప్రొఫెసర్ సురభి భారతి మాట్లాడుతూ.. బాలికల హక్కుల పరిరక్షణ, భద్రత, చదువుకు సమాజంలోని అన్నివర్గాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఏ ఆడపిల్ల అభద్రతకు, అఘాయిత్యాలకు లోను కాకుండా, విద్యతో వికాసం పొందాలని పేర్కొన్నారు. బేటీ బచావో.. బేటీ పడావో వంటి పథకాల అమలుతీరును శాస్త్రీయ పరిశోధనల ద్వారా విశ్లేషించి చూడాల్సిన అవసరం ఉందని ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ ప్రాంత విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.  దేశ జనాభా నిష్పత్తిలో పురుషుల కంటే మహిళలు తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు.  

దూరదర్శన్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డి. సుప్రశాంతి దేవి, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ నిహార కానేటి, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు శ్రీ బాల ప్యానల్ డిస్కషన్ లో పాల్గొని బాలికల రక్షణ, చదువు, సాధికారత తదితర అంశాలపై చర్చించారు. వర్క్ షాప్ లో వివిధ స్కూళ్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు, ప్రాజెక్టు పరిశోధకులు, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్లు పాల్గొన్నారు.