ఏజెన్సీ వైద్యం అధ్వానం..114 గ్రామాల చుట్టూ 10 కిలోమీటర్ల మేర హాస్పిటల్సే లేవు

ఏజెన్సీ వైద్యం అధ్వానం..114 గ్రామాల చుట్టూ 10 కిలోమీటర్ల మేర హాస్పిటల్సే లేవు
  •     అంబులెన్సులు రాలేవు.. బైక్ అంబులెన్స్ లు సరిపోవు
  •     ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో మహిళల్లో రక్తహీనత 
  •     రాష్ట్రంలో సగం సిబ్బందితోనే నడుస్తున్న హాస్పిటల్స్
  •     వరల్డ్ బ్యాంకు ఎస్సా రిపోర్టులో మన వైద్య వ్యవస్థ డొల్లతనం
  •     2,700 కోట్ల రుణం కోసం.. వరల్డ్ బ్యాంకుకు ప్రభుత్వం దరఖాస్తు 

హైదరాబాద్, వెలుగు: మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తున్నాం అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని వరల్డ్ బ్యాంకు తేల్చిచెప్పింది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. వాస్తవంగా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మార్పుల కోసం టీజీ ఎస్వీఏఎస్టీహెచ్(టీజీ స్వస్థ్) ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం  రూ. 2,700 కోట్లు (300 మిలియన్ డాలర్లు) అప్పు అడిగింది. 

ఈ లోన్ ఇచ్చే ముందు ఇక్కడి పరిస్థితులను గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు స్టడీ చేసిన వరల్డ్ బ్యాంక్ టీమ్.. ఎన్విరాన్‌ మెంటల్ అండ్ సోషల్ సిస్టమ్స్ అసెస్‌మెంట్ (ఈఎస్ఎస్ఏ) పేరుతో వైద్య వ్యవస్థలోని డొల్లతనాన్ని రిపోర్టు రూపంలో సోమవారం నాడు డ్రాఫ్ట్ రూపంలో బయటపెట్టింది. ఈ డ్రాఫ్ట్ పై ప్రజలు, నిపుణుల నుంచి సూచనలు, సలహాలు కోరింది.

సబ్ సెంటర్ల వైపు చూడని వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు 

హాస్పిటల్స్ నుంచి వచ్చే ప్రమాదకరమైన బయో మెడికల్ వేస్ట్ నిర్వహణపై రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. సబ్ సెంటర్లలో పోగైన సూదులు, రక్తం అంటుకున్న కాటన్, బ్యాండేజీలను ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు చేత్తో పట్టుకుని ఆటోల్లో, ఆర్టీసీ బస్సుల్లో పీహెచ్‌సీలకు మోస్తున్నారు. దీనివల్ల ఆ సిబ్బందికి, తోటి ప్రయాణికులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. 

బయోవేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు పీహెచ్‌సీల వరకే వస్తున్నాయి తప్ప.. సబ్ సెంటర్ల వైపు చూడటం లేదు. దీనికి తోడు ఇంకా అనేక హాస్పిటల్స్ లో నిషేధిత పాదరసం పరికరాలను వాడుతున్నారు. ఆ వ్యర్థాలను సాధారణ చెత్తతో కలిపి కాల్చడం వల్ల విషవాయువులు వెలువడుతున్నాయని రిపోర్ట్ హెచ్చరించింది.

ఆశాలకు వెట్టి చాకిరీ

గ్రామీణ వైద్యానికి వెన్నెముకగా నిలుస్తున్న ఆశా వర్కర్లపై పనిభారం విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు తల్లీబిడ్డల ఆరోగ్యం చూసేవాళ్లు. ఇప్పుడు బీపీ, షుగర్ సర్వేలని, టీబీ అని, వ్యాక్సినేషన్ అని, ఆన్‌ లైన్ డేటా ఎంట్రీ అని.. ఇలా సవా లక్ష పనులను వారిపై రుద్దుతున్నారు. రిక్రూట్‌మెంట్ లేక ఉన్నవారితోనే వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని, అదనపు పనికి నయా పైసా ఇన్సెంటివ్ ఇవ్వడం లేదని రిపోర్ట్ పేర్కొంది. 

వైద్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా.. కాంట్రాక్ట్ నర్సులు, ఏఎన్‌ఎంలకు ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదు. ఒకవేళ సెలవు పెడితే జీతంలో కోత 
విధిస్తున్నారని రిపోర్ట్ తప్పుబట్టింది.

ఏజేన్సీ ఏరియాల్లో మరింత దారుణం

రాష్ట్రవ్యాప్తంగా వైద్యం పరిస్థితి ఎట్లున్నా.. ఏజెన్సీ ఏరియాల్లో మాత్రం అగమ్యగోచరంగా ఉందని రిపోర్ట్ స్పష్టం చేసింది. 15 జిల్లాల పరిధిలోని మారుమూల ప్రాంతాల్లో దాదాపు 114 గ్రామాలకు 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఒక్కటంటే ఒక్క హాస్పిటల్ కూడా లేదు. మైదాన ప్రాంతాల్లో 10 కిలోమీటర్లు, కొండ ప్రాంతాల్లో 5 కి.మీ. దూరం వరకు కనీసం సబ్ సెంటర్ కూడా దిక్కులేదు. అక్కడి రోడ్లు సరిగా లేక అంబులెన్సులు రావు. బైక్ అంబులెన్సులు ఉన్నా అవి సరిపోవడం లేదు. అత్యవసరమైతే ఆటోలలో, లేదంటే డోలె కట్టుకొని తీస్కపోవడమే దిక్కు. దీంతో సకాలంలో వైద్యం అందక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. 

ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గిరిజన మహిళలు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. రాష్ట్రంలోని పీహెచ్ సీ, యూపీహెచ్ సీ, సీహెచ్ సీ, డిస్ట్రిక్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ లో దాదాపు 50 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని వరల్డ్ బ్యాంక్ లెక్కగట్టింది. భవనాలు, బెడ్లు పెంచారు కానీ డాక్టర్లను నియమించలేదని, దీంతో ఉన్న స్టాఫ్ మీదే విపరీతమైన పనిభారం పడుతోందని పేర్కొంది.

ఇవి మార్చుకోవాల్సిందే... 

లోన్ ఇస్తాం గాని.. నిర్ణీత గడువులో ఈ లోపాలను సరిదిద్దుకోవాలని ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు సూచించింది. ఆ 114 మారుమూల గిరిజన గ్రామాలకు వైద్యం అందేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సు పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. బయో మెడికల్ వేస్ట్‌ ను ట్రాక్ చేయడానికి బార్ కోడింగ్ సిస్టమ్ పెట్టాలని, ఆటోల్లో చెత్త తరలింపును ఆపేయాలని ఆదేశించింది. హాస్పిటల్స్ లో వృద్ధులు, వికలాంగుల కోసం ర్యాంపులు, వెస్ట్రన్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, ఫిర్యాదుల పరిష్కారానికి పటిష్ట వ్యవస్థను తేవాలని వరల్డ్ బ్యాంక్ తేల్చిచెప్పింది.