ఫోర్​ కొట్టిన వాన

ఫోర్​ కొట్టిన వాన
  • వరుణుడి ఖాతాలోకి నాలుగో పోరు 
  • ఇండియా–న్యూజిలాండ్‌ మ్యాచ్‌ రద్దు
  • ఇరు జట్లకు చెరో పాయింట్‌
  • ఇండో–పాక్​ మ్యాచ్​కూ వాన ముప్పు?

అనుకున్నదే అయింది.  టీమిండియా కు, ఫ్యాన్స్‌‌కు నిరాశే మిగిలింది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న కోహ్లీసేన హ్యాట్రిక్‌‌ విక్టరీ ఆశించిన మ్యాచ్‌‌ వరుణుడి ఖాతాలో చేరింది. వాన దెబ్బకు ఇండియా–న్యూజిలాండ్‌‌  మ్యాచ్‌‌ పూర్తిగా రద్దయింది. ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్‌‌ చేరింది. అకాల వర్షం కారణంగా టోర్నీలో తుడిచిపెట్టుకుపోయిన నాలుగో మ్యాచ్‌‌ ఇది. ఒక వరల్డ్‌‌కప్‌‌లో ఇన్ని మ్యాచ్‌‌లు రద్దవడం ఇదే తొలిసారి. దీనిపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతుండగా.. అన్ని లీగ్‌‌ మ్యాచ్‌‌లకు రిజర్వ్‌‌ డేలు ఇవ్వడం సాధ్యం కాదని ఐసీసీ చెబుతోంది.  ఆదివారం ఇండో–పాక్‌‌ పోరుకూ వాన ముప్పు ఉందట. ఆ మ్యాచ్‌‌ కూడా సాగకుంటే  టోర్నీ కళతప్పినట్టే..!

నాటింగ్‌‌హామ్‌‌:  నడి వేసవిలో కూడా ఇంగ్లండ్‌‌లో కురుస్తున్న అకాల వర్షాలు క్రికెట్‌‌ ప్రియులకు విసుగు తెప్పిస్తున్నాయి. ఎన్నో ప్రణాళికలు వేసుకొని మెగా టోర్నీ బరిలో నిలిచిన ఆటగాళ్లను, ఎంతో ఖర్చు చేసి ప్రత్యక్షంగా మ్యాచ్‌‌లు చూద్దామని వచ్చిన అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు కుమ్మరిస్తున్నాడు. మెగా టోర్నీలో నాలుగో మ్యాచ్‌‌ కూడా వరుణుడి ఖాతాలో పడింది. గురువారం ఇండియా–న్యూజిలాండ్‌‌ మ్యాచ్‌‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది.  రెండు రోజుల నుంచి భారీ వర్షం కురియడంతో ఔట్‌‌ఫీల్డ్‌‌ చిత్తడిగా మారింది. ఉదయం నుంచి చినుకులు వస్తుండడంతో  కనీసం టాస్‌‌ వేయడం కూడా సాధ్యపడలేదు. దాంతో, ఆటగాళ్లు  మైదానంలోకి కూడా రాలేకపోయారు. మ్యాచ్‌‌ రద్దు కావడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్‌‌ లభించింది. తన తొలి మూడు మ్యాచ్‌‌ల్లో గెలిచిన  కివీస్‌‌ ప్రస్తుతం 7 పాయింట్లతో టేబుల్‌‌ టాపర్‌‌గా కొనసాగుతోంది. ఇండియా ఐదు పాయింట్లతో మూడో ప్లేస్‌‌కు చేరుకుంది.  ఆదివారం జరిగే తర్వాతి మ్యాచ్​లో పాకిస్థాన్‌‌తో కోహ్లీసేన తలపడనుంది. అయితే, ఆ మ్యాచ్‌‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉండడం  మరింత ఆందోళన కలిగిస్తోంది.

విసిగించిన వాన.. ఫ్యాన్స్‌‌ నిరాశ

ఇప్పటికే మూడు మ్యాచ్‌‌లు వర్షార్పణం అయినా.. ఈ మ్యాచ్‌‌కు ముప్పు ఉందని తెలిసినా ఇండియా ఫ్యాన్స్‌‌ పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. ఉదయం నుంచే చినుకులు పడుతున్నా లెక్కచేయకుండా  ఇండియా జెండాలతో స్టేడియానికి బారులు తీరారు. కానీ, వర్షం ఆగకపోవడంతో నిర్ణీత సమయానికి టాస్‌‌ పడలేదు. ఇండియా టైమ్‌‌ ప్రకారం 3 గంటలకు అంపైర్లు పిచ్‌‌, ఔట్‌‌ ఫీల్డ్‌‌ను పరిశీలించారు. అప్పటికి చినుకులు తగ్గడంతో ఫ్యాన్స్‌‌లో కాస్త ఉత్సాహం కనిపించింది. కానీ, కొద్దిసేపటికే వర్షం మళ్లీ మొదలైంది.  వాన వస్తూ, పోతుండగా.. మరో రెండు సార్లు ఇన్‌‌స్పెక్షన్‌‌ చేసిన అంపైర్లు రాత్రి 7.30కు మ్యాచ్‌‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో, ఫ్యాన్స్‌‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక్క బంతి పడకుండా ఆట రద్దయితే టిక్కెట్ల డబ్బులు ఐసీసీ వాపస్‌‌ చేస్తుంది. అయితే, చాలా మంది టిక్కెట్లను బ్లాక్‌‌లో ఎక్కువ రేటుకు కొనుగోలు చేశారు. దాంతో, వాళ్లు పెద్ద మొత్తం కోల్పోనున్నారు. కాగా, ప్రతీ మ్యాచ్‌‌కు ఇన్సూరెన్స్‌‌ ఉండడంతో బ్రాడ్‌‌కాస్టర్లకు ఎలాంటి నష్టం లేదు.

సరైన నిర్ణయం–కోహ్లీ

మ్యాచ్‌‌ రద్దు నిర్ణయం సరైనదని ఇండియా కెప్టెన్‌‌ కోహ్లీ అన్నాడు. ‘ఔట్‌‌ ఫీల్డ్‌‌ బాలేదు. దీనిపై ఆడకపోవడమే సరైన నిర్ణయం. రెండు జట్లు ఇదివరకు ఆడిన అన్ని మ్యాచ్‌‌ల్లో గెలిచాయి. కాబట్టి ఇప్పుడు ఒక్కో పాయింట్‌‌ తీసుకోవడంలో ఇబ్బందేమీ లేదనుకుంటున్నా.  దీన్ని స్వీకరిస్తున్నామ’ని పేర్కొన్నాడు.  ఆట సాగకపోవడం విచారకరమే అయినా.. ప్లేయర్లకు కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశం వచ్చిందని న్యూజిలాండ్‌‌ కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ అన్నాడు.