
నాటింగ్‌హమ్: సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ లీగ్ దశలో మరో మ్యాచ్‌కు రెడీ అయింది. వెస్టిండీస్‌పై భారీ స్కోరును ఛేజ్ చేసి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ఉన్న బంగ్లాదేశ్‌తో గురువారం అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఫించ్‌సేన సెమీస్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. మరోవైపు ప్రస్తుతం ఐదు పాయింట్లతో ఉన్న బంగ్లా సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఆసీస్‌పై కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో కంగారూ టీమే ఫేవరెట్ అయినా సీనియర్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ ఫామ్ బంగ్లా నుంచి ప్రమాద హెచ్చరికలు పంపుతుంది. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా సామర్థ్యం ఏంటో స్పష్టమైంది. దీంతో ఏమాత్రం అజాగ్రత్తకు పోయినా ఆసీస్‌కు అవమానం తప్పకపోవచ్చు. అయితే షకీబ్‌ను అడ్డుకుంటామని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ చెబుతున్నాడు. షకీబ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉండగా విండీస్‌తో మ్యాచ్ తర్వాత బంగ్లా ప్రధాన బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీమ్‌తో పాటు లిటన్ దాస్ కూడా టచ్‌లోకి వచ్చారు. దీంతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం చాలా బలంగా మారింది. దీనికి తోడు ఆసీస్ పేస్ విభాగాన్ని చూసి భయపడే సీన్ లేదని విండీస్ మ్యాచ్ అనంతరం షకీబ్ కూడా పేర్కొన్నాడు. అయితే బంగ్లా బౌలింగ్ విభాగం మాత్రం నిలకడ లేమితో సతమతమవుతుంది. వారుకూడా గాడిలో పడితే వరల్డ్‌కప్ వేటలో ఉన్న ఆస్ట్రేలియాకు షాక్ తగిలినా ఆశ్యర్యపోవాల్సిన పని లేదు. కాగా, పిచ్ స్వభావం దృష్ట్యా ఈ మ్యాచ్‌లో ఆసీస్ తుది జట్టులో ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండే చాన్సుంది. అయితే జంపా, లియాన్‌లో ఎవరికి అవకాశం దొరుకుతుందో చూడాల్సి ఉంది.