
హనుమకొండ సిటీ, వెలుగు: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు బి.వి.నిర్మలా గీతాంబ, ఎ.పట్టాభి రామారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
మొక్కలను కాపాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే కాలుష్యాన్ని తగ్గించుకోగలుగుతామని చెప్పారు. జిల్లా అదనపు న్యాయమూర్తులు నారాయణ బాబు, బి.అపర్ణాదేవి, రెండు జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే, వరంగల్ ఎఫ్ఆర్వో సందీప్, న్యాయవాదులు కేఎంసీఏజే టీం కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
తాడ్వాయి, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని డీపీవో దేవరాజ్అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం తాడ్వాయి మండల కేంద్రంలో ఎంపీడీవో సుమనవాణి, ఎంపీవో శ్రీధర్, పంచాయతీ కార్యదర్శులు, మండల సమాఖ్య సీసీలు, అంగన్వాడీ టీచర్లతో కలిసి ప్లాస్టిక్ ను నిషేధిద్దాం–పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వానాకాలం నేపథ్యంలో మండల స్థాయి అధికారులతో ఎంపీడీవో సుమన వాణి సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.
మొక్కలు విరివిగా నాటాలి
గ్రేటర్ వరంగల్, వెలుగు: మొక్కలు విరివిగా నాటాలని కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లోని సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ బాలరాజ్ సూచించారు. హాస్పిటల్ఆవరణలో మొక్కలు నాటారు. డాక్టర్లు దీపక్ రెడ్డి, నవీన్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.