ప్రపంచంలోనే తొలి 3డీ దేవాలయం..తెలంగాణలో

ప్రపంచంలోనే తొలి 3డీ దేవాలయం..తెలంగాణలో

ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా 3డీ దేవాలయం తెలంగాణలో నిర్మాణం కానుంది. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ఫ్రా టెక్ ఈ 3డీ ప్రింటెడ్ ఆలయాన్ని నిర్మించనుంది. ఈ ఆలయం 3డీ ప్రింటెడ్ ఆర్కిటెక్చర్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టనుంది.  సింప్లిఫోర్జ్ చేత అంతర్గతంగా అభివృద్ధి చేసిన సిస్టమ్, దేశీయంగా అభివృద్ధి చేసిన మెటీరియల్, సాఫ్ట్‌వేర్‌తో ఈ 3డీ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా నిర్మితమవుతున్న  త్రీడీ ఆలయం ఇదే కావడం విశేషం. 

ఎంత స్థలంలో నిర్మాణం..

3డీ ఆలయాన్ని 30 అడుగుల ఎత్తులో 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ  హిందూ దేవాలయాన్ని మొత్తం మూడు భాగాల నిర్మాణం జరగనుంది. ఇందుకు సంబంధించిన నమూనాలు కూడా విడుదల చేశాయి. ఈ ఆలయంలో మొత్తం మూడు గర్భాలయాలు ఉంటాయి.  గణేషుడు ఆలయం 'మోదక్' ఆకారంలో..శివుడి ఆలయం  దీర్ఘచతురస్రాకారంలో...పార్వతి దేవి ఆలయం కమలం ఆకారంలో నిర్మించనున్నారు. 

ఎక్కడ నిర్మిస్తారంటే..

సిద్దిపేట జిల్లాలోని చర్విత మెడోస్‌లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గతంలో చర్విత మెడోస్‌లో దేశంలో మొట్టమొదటి త్రీడీ ప్రింటెడ్ బ్రిడ్జ్ ప్రోటోటైప్‌ను అందించింది. ఇప్పుడు 3డీ  దేవాలయాన్ని అందించనుంది. ఈ త్రీడీ ప్రింటెడ్ నిర్మాణం అపారమైన సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా సింప్లిఫోర్జ్ బృందం అభివృద్ధి చేసిన రోబోటిక్ ఆర్మ్ సిస్టమ్ నిర్మాణ స్వేచ్ఛ, సామర్థ్యాలను కూడా ప్రదర్శించనుంది. 

త్వరలో 3డీ ఆలయం..

ఆలయ సూత్రాలను అనుసరిస్తూ,అవసరాలకు అనుగుణంగా డిజైన్ పద్ధతులు, కచ్చితమైన విశ్లేషణ, వినూత్న నిర్మాణ పద్ధతులతో 3డీ ఆలయాన్ని నిర్మిస్తున్నామని అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ ఎండి హరి కృష్ణ జీడిపల్లి తెలిపారు. ఇప్పటికే శివాలయం, మోదక్ నిర్మాణం పూర్తి అయిందని.. కమలం, పొడవైన గోపురాలతో కూడిన రెండవ దశ నిర్మాణం  మొదలైందన్నారు.