టోర్నీ నుంచి తప్పుకుంటున్నా...వరల్డ్ చెస్ ఛాంపియన్ కార్ల్‌సన్

టోర్నీ నుంచి తప్పుకుంటున్నా...వరల్డ్ చెస్ ఛాంపియన్ కార్ల్‌సన్

వరల్డ్ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకుంటున్నట్లు  వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్ ప్రకటించాడు. 2013 నుంచి వరుసగా ఐదుసార్లు  వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన కార్ల్‌సన్‌....2023లో జరిగే వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ లో  ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ టోర్నీలో ఆడాలన్న  ఉత్సాహం తనలో కలగడం లేదని చెప్పాడు. 

ఉత్సాహం రావడం లేదు..


వరల్డ్ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ లో ఆడేందుకు నాకు ఉత్సాహం రావడం లేదు. ఈ టోర్నీలో ఆడి నేను ఏం సాధిస్తా. ఇతరులకు వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ పై ఆసక్తి ఉంటుంది. కానీ నాకైతే ఆడే మూడ్ మాత్రం రావడం లేదు. అందుకే టోర్నీ నుంచి తప్పుకుంటున్నా అని కార్లసన్ తెలిపాడు.  చెస్ ఛాంపియన్ షిప్ నుంచి మాత్రమే తప్పుకుంటున్నా. కానీ ఆట నుంచి కాదు. ఎప్పటీ చెస్ లో మాత్రం చురుగ్గానే ఉంటాను. ప్రస్తుతం గ్రాండ్ చెస్ టూర్ కోసం క్రొయేషియాకు వెళ్తున్న. అక్కడి నుంచి చెస్ ఒలింపియాడ్ ఆడేందుకు చెన్నైకు వెళ్తా. ఆ టోర్నీలో ఆడాలని నాకు ఆసక్తి ఉందని వెల్లడించాడు. 

బోర్ కొట్టి తప్పుకున్నాడా..?


వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్..2013 నుంచి  వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ గెలుస్తూ వస్తున్నాడు. రికార్డు స్థాయిలో ఐదు సార్లు విజయం సాధించడంతో అతనికి ఈ టోర్నీపై ఆసక్తి పోయినట్లు తెలుస్తోంది.  తొలిసారిగా 2013లో విశ్వనాథన్ ఆనంద్ను ఓడించిన కార్లసన్..22 ఏళ్లకే వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. 2014లోనూ ఆనంద్‌ను ఓడించి సెకండ్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. 2016లో కర్జాకిక్‌, 2018లో కరువానా, 2021లో నెపోనియాచిలపై గెలిచి వరల్డ్ ఛాంపియన్ గా అవతరించాడు. 2011 నుంచి వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.  ప్రపంచ చెస్‌ చరిత్రలోనే అత్యధిక ఎలో రేటింగ్‌ 2882ను కార్లసన్ సాధించాడు. 

2023 వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో కార్ల్‌సన్‌  క్యాండిడేట్స్‌ టోర్నీ  విన్నర్ నెపోనియాచి తలపడబోతున్నాడు. అయితే ప్రస్తుతం కార్ల్‌సన్‌ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో.. క్యాండిడేట్స్‌ టోర్నీ రన్నరప్‌ డింగ్‌ లిరెన్‌తో నెపోనియాచిఆడే ఛాన్సుంది.  

మరోవైపు కార్ల్‌సన్‌ వరల్డ్ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకుంటున్నట్లు  తమకు ఎలాంటి సమాచారం రాలేదని  ఫిడె పేర్కొంది. ఒకవేళ కార్లసన్ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం అతని నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపింది.