- నవంబర్‌లోనూ తగ్గిన హోల్‌సేల్ ధరలు
- మైనస్ 0.32 శాతంగా హోల్‌సేల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: హోల్‌సేల్ ధరల పెరుగుదలను కొలిచే హోల్‌సేల్ ప్రైస్ ఇన్‌ఫ్లేషన్ (డబ్ల్యూపీఐ) ఈ ఏడాది నవంబర్‌లో మైనస్ 0.32 శాతంగా నమోదైంది. బేస్ ఇయర్ కంటే ధరలు తక్కువగా ఉంటే మైనస్‌లో ద్రవ్యోల్బణం (డిఫ్లేషన్) నమోదవుతుంది. పప్పులు, కూరగాయల ధరలు నెల ప్రాతిపదికన పెరిగినా, వరుసగా రెండో నెలలోనూ ద్రవ్యోల్బణం నెగెటివ్‌లో నమోదైంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ మైనస్ 1.21శాతంగా ఉంది. గత ఏడాది నవంబర్‌లో 2.16శాతంగా రికార్డయ్యింది. ఆహార పదార్థాలు, మినరల్ ఆయిల్స్, క్రూడ్ పెట్రోలియం, మెటల్స్, విద్యుత్ ధరలు తగ్గడంతో కిందటి నెలలో ధరలు దిగొచ్చాయి.
కాగా, ఆహార పదార్థాల్లో డిఫ్లేషన్ ఎనిమిది నెలలుగా కొనసాగుతోంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ ప్రకారం, రూపాయి బలహీనత, కొన్ని వస్తువుల ధరలు పెరగడంతో డిఫ్లేషన్ చాలా వేగంగా తగ్గింది. డిసెంబర్‌లో డబ్ల్యూపీఐ 0.5శాతం వద్ద పాజిటివ్‌కి మారొచ్చు.
