
న్యూఢిల్లీ: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీలను భారీ మొత్తానికి కట్టబెట్టిన బీసీసీఐ.. ఇప్పుడు ప్లేయర్ల ఆక్షన్‌కు రెడీ అవుతున్నది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 13న ముంబైలో ప్లేయర్ల వేలాన్ని నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యూజిలాండ్‌తో మూడో టీ20 సందర్భంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఆక్షన్‌కు సంబంధించి అధికారిక నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. ‘ఆక్షన్‌కు సంబంధించిన పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నెల 13 లేదా 14న ఉండొచ్చని అంటున్నారు. దీనిపై మాకు అఫీషియల్ సమాచారం లేదు. కొత్త లీగ్ కాబట్టి ప్రిపరేషన్స్ చాలా పకడ్బందీగా ఉండాలి. ప్రతి ప్లేయర్ గురించి అన్ని విషయాలను మేం తెలుసుకోవాల్సి ఉంటుంది’ అని అదానీ స్పోర్ట్స్ లైన్ ప్రతినిధి ఒకరు వెల్లడించాడు. మొత్తం వెయ్యి మంది ప్లేయర్లు వేలం కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం.