
- ఎలక్షన్స్ జరపకుండా అజర్ అడ్డుపడుతున్నారని హైకోర్టులో రిట్ పిటిషన్
- విచారణ ఫిబ్రవరి 7కి వాయిదా
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కమిటీకి ఎలక్షన్స్ నిర్వహించకుండా అధ్యక్షుడు అజారుద్దీన్ అడ్డుపడుతున్నారని, వెంటనే పాలకవర్గానికి ఎలక్షన్స్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.శ్రీనివాస్‌రావు ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వొకేట్ వాదిస్తూ, 2021 జులై నుంచి హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఉన్నారని, పాలకవర్గం లేకుండానే హెచ్‌సీఏ వ్యవహారాలు నిర్వహిస్తున్నారని అర్షద్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
జనరల్‌బాడీ మీటింగ్ కూడా పెట్టడం లేదన్నారు. 2022 డిసెంబర్ 11న జరిగిన స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్‌లో పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేసినా దాని అమలుకు చర్యలు తీసుకున్న వారే లేరన్నారు. హెచ్‌సీఏ వివాదం సుప్రీంకోర్టుకు కూడా చేరిందని, రిటైర్డు హైకోర్టు జడ్జి జస్టిస్ కక్రూ ఆధ్వర్యంలో కమిటీ వేసినప్పటికీ ఆ కమిటీకి కూడా అనేక అవరోధరాలు కలిగిస్తున్నారని చెప్పారు. ఆ కమిటీలోని మెంబర్ వంకా ప్రతాప్, అజారుద్దీన్‌లు కుమ్మక్కు అయ్యారని, పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. హెచ్‌సీఏలో ప్రక్షాళన చర్యలు తీసుకునేందుకు జస్టిస్ కక్రూ చర్యలు తీసుకుంటుంటే వారిద్దరూ ప్రతాప్, అజర్ అడ్డుకుంటున్నారని అర్హద్ పేర్కొన్నారు. కాగా, విచారణ ఫిబ్రవరి 7కి వాయిదా పడింది.